కవాడిగూడ, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ) : ‘ఉద్యోగులు, పెన్షనర్లకు కాంగ్రెస్ ఎన్నో ఆశలు చూపింది. అధికారంలోకి వచ్చాక ఆ హామీలను మరిచింది. ఇచ్చిన వాగ్దానాలను తీర్చాలనే కోరుతున్నాం. ఇప్పటివరకూ కాంగ్రెస్ సర్కార్‌ను వేడుకుంటూ ఎదురుచూశాం. ఇక వేగలేము. సర్కార్‌తో తాడోపేడో తేల్చుకుంటాం. ఈ నెల 15 వరకు డెడ్‌లైన్ విధించాం. మా సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం’ అని ఉద్యోగ, పెన్షనర్స్ అసోసియేషన్ల నేతలు హెచ్చరించారు. పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా తరలివచ్చిన పెన్షనర్లు సోమవారం ధర్నాచౌక్ వద్ద మహాధర్నా చేపట్టారు. వందలాది మంది ప్రభుత్వ పెన్షనర్లు పాల్గొని రేవంత్ సర్కార్ నిర్లక్ష్యంపై విరుచుకుపడ్డారు. ప్లకార్డులను ప్రదర్శిస్తూ తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని, సర్కార్ మొండివైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు. మహాధర్నాను ఉద్దేశించి ఆలిండియా స్టేట్స్ పెన్షనర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి డీ సుధాకర్ మాట్లాడారు. గత మార్చిలో పార్లమెంటులో ఫైనాన్స్ బిల్లుతోపాటు 1972 నుంచి ఉన్న పెన్షనర్లకు సంబంధించిన నిబంధనలను మార్పు చేశారని తెలిపారు. పెన్షనర్లను రెండు గ్రూపులుగా విభజించి, అందులో పీఆర్సీలు, డీఏలు ఎవరికి ఇవ్వాలనే అధికారాన్ని కేంద్రం తన పరిధిలోకి మార్చుకోవడం సరికాదని చెప్పారు. పెన్షనర్లకు నష్టం కలిగించేందుకే కేంద్రం చర్యలు తీసుకుంటున్నదని విమర్శించారు. కేంద్రం చట్టాలనే రాష్ర్టాలూ అనుసరించే అవకాశం ఉన్నందున పెన్షనర్ల మెడపై కత్తిపెట్టినట్టయిందని ఆందోళన వ్యక్తంచేశారు.
పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పెన్షనర్ల సమస్యలను తీరుస్తామని హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చాక ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. సర్కార్ ఏర్పాటైన 15 రోజుల్లో ఎంప్లాయీస్ హెల్త్ స్కీంను ప్రకటిస్తామన్న హామీ ఎటుపోయిందని నిలదీశారు. మూడు డీఏలు, డీఆర్లు ఎరియర్తో కలిపి చెల్లిస్తామన్న ప్రభుత్వ హామీ ఏమైందని ప్రశ్నించారు.
ఆగస్టు 15 వరకు టార్గెట్ పెడుతూ తాము కూడా సర్కార్‌కు నోటీసు ఇచ్చామని, ప్రభుత్వం నుంచి స్పందన కోసం ఎదురు చూస్తున్నామని ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ చెప్పారు. త్వరలోనే ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని హెచ్చరించారు. ఉద్యోగులు, పెన్షనర్లకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఎంప్లాయీస్ జేఏసీ సెక్రటరీ జనరల్ ఊలూరి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఏప్రిల్ 24 తర్వాత రిటైర్ అయిన వారికి ఇప్పటికీ బెనిఫిట్స్ రాకపోవడంతో అప్పుల బాధలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నారని జేఏసీ నాయకుడు తులసి సత్యనారాయణ ఆవేదన వ్యక్తంచేశారు. సమస్యలపై చెప్పుకొనేందుకు ప్రభుత్వ పెద్దలను, మంత్రులను, అధికారులను కలిసేందుకు అపాయింట్మెంట్ కోరినా స్పందన రాలేదని జేఏసీ అధ్యక్ష వర్గ సభ్యుడు కే లక్ష్మయ్య ఆవేదన వ్యక్తంచేశారు. ఉద్యోగ సంఘ ప్రతినిధి ఎం సంయుక్త, ఎస్టీయూ ప్రధాన కార్యదర్శి సదానంద్‌గౌడ్, ఏపీటీఎఫ్ అధ్యక్షుడె సునిల్ మహాధర్నాకు సంఘీభావంగా పాల్గొని మద్దతు పలికారు. మహాధర్నాలో పాలకుర్తి కృష్ణమూర్తి, ఉమాదేవి, బీ సత్యనారాయణ, నర్సయ్యగౌడ్ పాల్గొన్నారు.