చేనేతల బతుకులు మళ్లీ ఛిద్రమవుతున్నాయి.. చేయూతనందించాల్సిన సర్కారు ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నది. పదేండ్లపాటు కేసీఆర్ చేనేత రంగానికి సంక్షేమ రంగులు అద్దితే.. కొత్తగా వచ్చిన సర్కారు పది నెలల్లో నేతన్నను కోలుకోలేని దెబ్బతీసిందని సర్వత్రా మండిపడుతున్నారు.
Handloom Workers | హైదరాబాద్, సెప్టెంబర్ 29(నమస్తే తెలంగాణ): పది నెలలుగా చేనేత కార్మికులు ఉపాధి కోసం ఎదురుచూస్తున్నారు. సరైన గిరాకీ లేక ఆర్థికంగా చితికిపోతున్నారు. రాష్ట్రంలో చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చేనేత రంగాన్ని సర్కారు పూర్తిగా విస్మరించినట్లు సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేతన్నల ఆర్థిక పరిస్థితులు దయనీయంగా మారాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాజీ సీఎం కేసీఆర్ హయాంలో మాదిరిగా ప్రస్తుత ప్రభుత్వం చేనేత కార్మికులకు పని కల్పించడం లేదని వాపోతున్నారు. పదేండ్ల క్రితం నాటి అవస్థలు మళ్లీ మొదలయ్యాయని మదనపడుతున్నారు. ఉపాధి కరువవ్వడంతో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు దాపురించాయని చేనేత కార్మిక సంఘం నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పది నెలలుగా సరైన గిరాకీ లేకపోవడంతో ‘చేనేత చేయూత’ పథకం కింద రికరింగ్ డిపాజిట్ ఖాతా-1 అకౌంట్లో నెలవారీగా కార్మికులు డబ్బులు జమ చేయలేకపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5000 మందికి పైగా చేనేత కార్మికులది ఇదే పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆర్డీ-1 అకౌంట్లో ప్రస్తుతం జమ చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఇలా చేస్తే ఆర్డీ-2 అకౌంట్ నుంచి డబ్బుల మొత్తం డబుల్ అవుతాయి. రూ.2000 జమ చేస్తే, తిరిగి రూ.4000 నేతన్న ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తుంది. ఈ విధానానికి అవకాశం కల్పించాలని హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ శాఖ అధికారులు, ప్రభుత్వాన్ని చేనేత కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం చేనేత మిత్ర పథకం ద్వారా నూలు సబ్సిడీ 40శాతంతో నేరుగా వీవర్‌కు రూ.2వేలు, వర్కర్‌కు రూ.500 అందించింది. ఈ పథకం ద్వారా 2023 అక్టోబర్ వరకు నేతన్నలకు లబ్ధి చేకూరింది. కానీ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నూలుకు ఎలాంటి రాయితీ ఇవ్వడం లేదు.