హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కమ్యూనిస్టు, వామపక్ష శక్తులు ఏకంకావాల్సిన అవసరం ఉన్నదని ఎంసీపీఐ(యూ) జాతీయ నేతలు మద్దికాయల అశోక్ ఓంకార్, కుల్దీప్సింగ్లు తెలిపారు. హైదరాబాద్‌లో రెండ్రోజులుగా జరుగుతున్న ఎంసీపీఐ(యూ) పొలిట్‌బ్యూరో విస్తృతస్థాయి సమావేశాలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 2018 నుంచి కొన్ని స్వల్ప భిన్నాభిప్రాయాలతో పనిచేసిన పార్టీలు.. ఒకే సంస్థగా ఏర్పడాలని నిర్ణయించినట్టు తెలిపారు. అందులో భాగంగా ఫిబ్రవరి 23, 24 తేదీల్లో జోధ్‌పూర్‌లో ఆలిండియా ఐక్య కన్వెన్షన్ నిర్వహించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. ఈ కన్వెన్షన్‌కు వివిధ రాష్ట్రాల నుంచి 200 మంది ప్రతినిధులను ఎంపిక చేసినట్టు చెప్పారు. సమావేశంలో గాదగోని రవి, వల్లెపు ఉపేందర్‌రెడ్డి, కిరణ్ జిత్‌సింగ్ షేఖాన్, ప్రేంసింగ్ భంగ్, కాటం నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.