Runa Mafi | హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ): గత ఎన్నికల సమయంలో రాష్ట్రంలోని చేనేత కార్మికులకు లక్ష రూపాయల వరకు రుణ మాఫీ చేస్తామని వాగ్దానం చేసిన కాంగ్రెస్ పార్టీ దాని అమలుకు మీనమేషాలు లెక్కిస్తున్నది. రెండు రోజుల క్రితం రుణ మాఫీ కోసం మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం లబ్ధిదారుల సంఖ్యను తగ్గించేందుకు కుయుక్తులు పన్నిందని తెలంగాణ వస్త్ర కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. నేతన్నలందరికీ రుణమాఫీ చేసే ఉద్దేశం లేకపోవడం వల్లనే జిల్లాస్థాయి, రాష్ట్ర స్థాయి కమిటీలంటూ కొత్త నాటకానికి తెరతీసిందని ఆయా సంఘాల నేతలు విమర్శిస్తున్నారు.
లబ్ధిదారుల జాబితాను తొలుత జిల్లా స్థాయి కమిటీ పరిశీలించి, ఆ తరువాత వాటిని రాష్ట్ర స్థాయి కమిటీ పరిశీలించి, సాధ్యాసాధ్యాలు బేరీజు వేసుకొని చివరికి రుణమాఫీ చేయడానికి కనీసం ఆరు నెలలు పడుతుందని భావిస్తున్నారు. ఇదంతా లబ్ధిదారుల సంఖ్యను తగ్గంచుకోవడం కోసమేనని మండిపడుతున్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కమిటీలతో నిమిత్తం లేకుండా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వెంటనే నేత కార్మికులందరికీ రుణమాఫీని వర్తింపజేయాలని తెలంగాణ చేనేత కార్మిక సంఘం నాయకుడు చెరుకు స్వామి, పవర్లూమ్ కార్మిక సంఘం నాయకుడు కూరపాటి రమేష్ డిమాండ్ చేస్తున్నారు.