హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో పరిపాలనపై రోజురోజుకూ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టు కోల్పోతున్నదని, హామీల అమలుపై ప్రశ్నించే వారిని అనేక విధాలుగా హింసిస్తూ శిక్షిస్తున్నదని శాసన మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. ఈ వ్యక్తిత్వ హననం మూమ్మాటికీ రేవంత్రెడ్డి సర్కారు కుట్రలో భాగమేనని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎన్నికల్లో అనేక హామీలిచ్చి ప్రజలను నమ్మించి గద్దెనెక్కిన తర్వాత అమలు చేయడం లేదని మండిపడ్డారు. పాలనపై పట్టు సాధించి పథకాలను అమలు చేయాలన్న సోయిని మరిచి, కక్ష సాధింపు చర్యల్లో భాగంగా లక్షల కోట్ల అప్పులు, కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతి, ఫోన్ ట్యాపింగ్ అంటూ అబద్ధాలు ప్రచారం చేస్తూ ప్రజల దృష్టిని మరల్చే కుట్రలకు ఈ ప్రభుత్వం ఒడిగడుతున్నదని నిప్పులు చెరిగారు. అధికారంలోకి వచ్చి 100 రోజులు గడవక ముందే కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర ప్రజావ్యతిరేకతను మూటగట్టుకున్నదని, దాన్ని గమనించి అనేక విధాలుగా బీఆర్ఎస్ పాలనపై విమర్శలు చేస్తూ బీఆర్ఎస్ను, కేసీఆర్ను, ఆయన కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేస్తున్నదని దుయ్యబట్టారు.
అక్రమ కేసులతో భయానకం..
ప్రశ్నించే వారిని కాంగ్రెస్ ప్రభుత్వం హింసిస్తూ అక్రమ కేసులతో భయానక వాతావరణం సృష్టిస్తున్నదని సిరికొండ ఆగ్రహం వ్యక్తంచేశారు. దిగజారుడు ప్రయత్నాలతో సర్కారు ఇంకా అభాసుపాలైందని విమర్శించారు. ఈ పరిస్థితుల్లో వ్యక్తిత్వ హననానికీ దిగజారిందని మండిపడ్డారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న వారిని శిక్షించాల్సింది పోయి వెనకేసుకొస్తూ ప్రశ్నించే వారిని శిక్షిస్తున్నదంటే ఈ వ్యక్తిత్వ హనన చర్య ముమ్మాటికీ రేవంత్ కుట్రలో భాగమేనని ఆగ్రహం వ్యక్తంచేశారు. వ్యక్తిత్వ హననం గురించి ప్రశ్నిస్తే నేరమా? అని ప్రశ్నించారు. తమ సంయమనాన్ని బలహీనతగా భావించవద్దని హెచ్చరించారు.