కరీంనగర్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/జగిత్యాల : సహజంగా దేశం, రాష్ట్రం ఎక్కడైనా సరే ప్రతిపక్ష పార్టీల నుంచి నాయకులు అధికార పార్టీలోకి వలసలు వెళ్లడం సాధారణం. కానీ, రాష్ట్రంలో మాత్రం సీన్ రివర్స్ అవుతున్నది. అధికారంలో ఉన్న హస్తం పార్టీని కాలదన్నుతూ ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. ‘కాంగ్రెస్ అంటేనే జీవన్‌రెడ్డి.. జీవన్ అంటే కాంగ్రెస్’ అని ఇన్నాళ్లూ చెప్పుకొన్న మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డి ఆ పార్టీతో నాలుగు దశాబ్దాలకు పైగా ఉన్న అనుబంధాన్ని తెంచుకొని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో కలిసి పనిచేసేందుకు ముందుకొచ్చిన తీరు ఇప్పుడు కాంగ్రెస్‌లో కాక పుట్టిస్తున్నది. ఇదే బాటలో నడిచేందుకు మరికొందరు సీనియర్లు సిద్ధమవుతున్నారు.
వీళ్లే గాక వందలాది మంది శ్రేణులు కదులుతున్న తీరు ఇప్పుడు అధికార పార్టీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది. ఈ నేపథ్యంలో ఈ నెల 20న జరిగే బీఆర్ఎస్ జగిత్యాల సభ విజయవంతం కాకుండా ఒకవైపు కుట్రలు పన్నుతూనే, మరోవైపు క్యాడర్ చేజారిపోకుండా అధిష్ఠానం శతవిధాలుగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. అందులో భాగంగా కొంత మందికి నామినేటెడ్ పోస్టులను ఎరవేస్తుండగా, మరికొంతమందిని పార్టీ వీడకుండా ఖాకీలను ప్రయోగిస్తున్నది. అయినా సరే..‘జీవన్ చేరిక ఆరంభం మాత్రమే.. అసలు సినిమా ముందున్నది’ అని పార్టీ వర్గాలే చర్చించుకోవడం గమనార్హం.
హస్తం పార్టీలో సీనియర్లకు అన్యాయం
బీఆర్ఎస్లో జీవన్‌రెడ్డి చేరికకు అంతా సిద్ధమైన క్రమంలో తాజాగా కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వైఖరికి వ్యతిరేకంగా కొడిమ్యాల మండలంలో ఈ నెల 16న ఆ పార్టీకి చెందిన వందలా ది మంది నాయకులు రాజీనామా చేయడం గమనార్హం. ఫిరాయింపుదారులకు పెద్దపీట వేసి, పార్టీనే నమ్ముకొని దశాబ్దాలుగా కొనసాగుతున్న నాయకులు, కార్యకర్తలను సీఎం రేవంత్‌రెడ్డి అవమానాలకు గురిచేయడంతో వారంతా ఆవేశంతో రగిలిపోతున్నారు. మాజీ మంత్రి జీవన్రెడ్డిలాంటి నాయకుడిని అవమానాలకు గురిచేయడం, బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేను పార్టీలోకి తీసుకొని ఆయన వర్గానికే ప్రాధాన్యం ఇవ్వడంతో జీవన్‌రెడ్డి సైతం ఆత్మగౌరవాన్ని చంపుకోలేకపోయారు.
బీఆర్ఎస్లోకి కేటీఆర్ ఆహ్వానించడం, కేసీఆర్ సైతం స్నేహహస్తం చాచడంతో ఆయన బీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ జగిత్యాలలో 20న భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశా రు. ఈ సభ ద్వారా ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూ ప్రజావ్యతిరేక ప్రభుత్వంపై కేసీఆర్ సమరభేరి మోగించనున్నారు. సభ ఉంటుందని ప్రకటించినప్పటి నుంచే ఉమ్మడి కరీంనగర్ వ్యాప్తంగా రైతులు, ప్రజలు, కార్యకర్తలు సభ కోసం ఉత్సాహంగా పనిచేయడం మొదలుపెట్టారు. రైతుభరోసా, ఉద్యోగాల ప్రకటన, తులం బంగా రం వంటి పథకాల ఊసే లేకపోవటాన్ని ఇంటింటికీ చెబుతూ ప్రజలే సొంతంగా సభను సక్సెస్ చేయాలని కోరుతున్నారు.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా జీవన్‌రెడ్డి వెంటే!
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పలు నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధు లు కూడా కాంగ్రెస్‌ను వీడేందుకు సిద్ధమయ్యారు. జగిత్యాల నియోజకవర్గ పరిధిలో 101 గ్రామాలకు కాంగ్రెస్ 90 పంచాయతీలను కైవసం చేసుకోగా.. అందులో దాదాపు 55 గ్రామాల సర్పంచ్‌లు జీవన్‌రెడ్డి వెంట బీఆర్ఎస్లో చేరబోతున్నారు. రాయికల్ పట్టణంలోని నా యకులు, పలువురు కౌన్సిలర్లతో పాటు మండలానికి చెందిన మాజీ జడ్పీటీసీ సభ్యురాలు గోపి మాధవితో పాటు పలువురు మార్కెట్ కమిటీ చైర్మన్లు, సభ్యులు, సింగిల్‌విండో చైర్మన్లు సైతం కాంగ్రెస్‌కు రాంరాం చెప్పనున్నారు. సారంగాపూర్, బీర్పూర్ మండలాల్లోని మసర్తి రమేశ్, జితేందర్, సుభాష్, లక్ష్మణ్‌రావు, రాంచంద్రారెడ్డి లాంటి కీలక నాయకులు జీవన్ వెంట కదులుతున్నారు. జగిత్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ మున్నాతో పాటు పలువురు కౌన్సిలర్లు, స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచిన కౌన్సిలర్లు హస్తం పార్టీని వీడనున్నారు.
ధర్మపురి నియోజకవర్గంలోని గొల్లపల్లి, పెగడపల్లి, వెల్గటూర్, ధర్మారం మండలాల్లో చాలామంది సర్పంచ్‌లు, మాజీ సర్పంచ్‌లు గులాబీ పార్టీలో చేరనున్నారు. పెగడపల్లి మండలం నుంచి బతికపల్లి సర్పంచ్ ముంజ మహేశ్వరి, తాటిపర్తి నాయకులు శోభారాణి, ప్రభాకర్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి సైతం చేరనున్నారు. వెల్గటూర్‌కు చెందిన జితేందర్‌రెడ్డి, శైలేందర్‌రెడ్డి, డాక్టర్ గురవారెడ్డి లాంటి కీలక నాయకులు కూడా ఉత్సాహంగా ఉన్నారు. చొప్పదండి నియోజకవర్గంలోని మల్యాల, కొడిమ్యాల మండలానికి చెందిన కాంగ్రెస్ క్యాడర్లో మెజారిటీ కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధమయ్యారు. వేములవాడ నియోజకవర్గంలోని కథలాపూర్, మేడిపల్లి, బీమారం మం డలాలకు చెందిన పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు సైతం చేరుతున్నారు.
ఖాకీలను ప్రయోగిస్తున్న సర్కార్?
బీఆర్ఎస్ సభను అడ్డుకునేందుకు కాంగ్రెస్ సర్కార్ కుట్రలు పన్నుతున్నదన్న విమర్శలు వస్తున్నాయి. జగిత్యాల సభ కోసం బీఆర్ఎస్ కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేస్తున్నది. ఆగ్రశ్రేణి నాయకులంతా సభ సక్సెస్‌పై దృష్టిపెట్టారు. దీనికి తోడు ప్రభుత్వంపై పెల్లుబుకుతున్న అసంతృప్తితో ప్రజలు సభకు వెల్లువలా తరలివచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో సభను ఎలాగైనా అడ్డుకోవడానికి సర్కార్ కుట్రలు మొదలుపెట్టినట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం. కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధమవుతున్న క్యాడర్‌ను కాపాడుకునేందుకు అధిష్ఠానం రంగంలోకి దిగినట్టు తెలుస్తున్నది.
ఒకవైపు నామినేటడ్ పోస్టులను ఎరగా చూపుతూనే.. ఓ అడుగుముందుకేసి పార్టీ మారొద్దని బెదిరిస్తున్నట్టు సమాచారం. పార్టీ మారితే.. భవిష్యత్‌లో చాలాకష్టాలు చవిచూడాల్సి వస్తుందని ప్రత్యక్షంగా పరోక్షంగా హెచ్చరికలు చేస్తూ భయానికి గురిచేస్తున్నట్టు తెలుస్తున్నది. ఇదే గాక సభ సక్సెస్ కాకుండా కొందరు పోలీసులను వ్యూహాత్మకంగా సర్కార్ రంగంలోకి దింపుతున్నట్టు అత్యంత విశ్వసనీయ తెలిసింది. అయితే వీటిని దీటుగా ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సన్నద్ధం కాగా, సభ ఊహించని రీతిలో సక్సెస్ అవుతుందని బీఆర్ఎస్ పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నది.
నామినేటెడ్ పోస్టుల ఎర?
చేజారుతున్న క్యాడర్‌ను కాపాడుకునేందుకు హస్తం పార్టీ నానా తంటాలు పడుతున్నది. ఎన్నడూ లేనివిధంగా ఇటీవల ఈ ప్రాంత నేతలతో స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమావేశమైన విషయం తెలిసిందే. అయినా ‘హస్తం’ నేతల్లో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో పలువురు నేతలను రంగంలోకి దింపిన అధిష్ఠానం, నామినేటెడ్ పోస్టులను ఎరగా వేస్తున్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తున్నది. రెండేండ్లుగా ఏనాడూ పట్టించుకోని అధిష్ఠానం, ఇప్పుడు జీవన్‌రెడ్డి పార్టీని వీడాక తేరుకొని మభ్యపెట్టాలని మాట్లాడుతుందే తప్ప.. అది ప్రేమ కాదనే విషయాన్ని గుర్తించిన నేతలు పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. వీరంతా ఈ నెల 20న జరిగే సభలో బీఆర్ఎస్లో చేరేందుకు పక్కాగా ప్రణాళికలు చేసుకుంటున్నారు. ఈ పరిణామం కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను కలవర పెడుతున్నది. ఇప్పటికే ఆ పార్టీ ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేకత పెరిగిపోతున్నదని గుర్తించి సీఎం పనితీరుపై అంతర్గత సమావేశాల్లో అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. బీఆర్ఎస్పై ప్రజల్లో ఆదరణ పెరుగడం, బీఆర్ఎస్ నాయకులు సైతం నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రను పోషిస్తున్నారని, ఇలాంటి సమయంలో వారికి జీవన్‌రెడ్డి తోడైతే తమ ప్రభుత్వానికి, పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందన్న అభిప్రాయపడుతున్నట్టు తెలిసింది.
మేడిపల్లి సత్యం ఇలాకాలో ముసలం
జగిత్యాల నుంచి మొదలైన మంటలు, ఇప్పుడు చొప్పదండి నియోజకవర్గాన్ని సైతం తాకాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి వైఖరిని నిరసిస్తూ తాజాగా కాంగ్రెస్ శ్రేణులు రాజీనామా చేశారు. కొడిమ్యాల మేజర్ పంచాయతీ మాజీ సర్పంచ్ పిడుగు ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ గడ్డం చంద్రమోహన్‌రెడ్డితో పాటు వంద మంది కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఎన్నికల సమయంలో మేడిపల్లి సత్యం ఇచ్చిన అనేక హామీలను అమలు చేయాలని కోరితే తమనే శత్రువులుగా చూశారని, వివిధ అంశా ల్లో వాటాలు తీసుకుంటున్నారంటూ ఘాటు గా విమర్శించారు.
జెండా మోసిన వారిని పక్కనపెట్టి కొత్తవారికి నామినేటెడ్ పదవులు ఇస్తున్నారని, అందులో ఎమ్మెల్యే వాటా ఎంతో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. రాజీనామా చేస్తున్నామని తెలుసుకొని పది రోజుల నుంచి తన అనుచరులతో నామినేటెడ్ పదవులు ఇప్పిస్తానని రాయబారానికి పంపుతున్నారని చెప్పారు. అయినా వినకపోవడంతో తనతో పాటు రాజీనామాకు సిద్ధపడ్డ నాయకులు, కార్యకర్తలకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి ఎమ్మెల్యే ఉన్న కాంగ్రెస్‌లో ఉండలేనని పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు.