జగిత్యాల రూరల్, నవంబర్ 16: ప్రిన్సిపాల్ తమను వేధిస్తున్నదని ఆరోపిస్తూ జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్‌లోని బీసీ సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థినులు శనివారం రోడ్డెక్కారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రిన్సిపాల్ తమను తన అవసరాలకు వాడుకుంటున్నదని, సెలవుల్లో ఇంటికి వెళ్లి ఆలస్యంగా వస్తే డబ్బులు వసూలు చేస్తున్నదని ఆరోపించారు. జరిమానా డబ్బుల లెక్కలు అడిగితే పాఠశాల అభివృద్ధి కోసమని చెబుతున్నదని అన్నారు. తమను చూడటానికి వచ్చిన తల్లిదండ్రుల పట్ల కూడా దురుసుగా ప్రవరిస్తున్నదని, సమయపాలన లేకుండా స్కూల్‌కు వస్తుందని, నిత్యం ప్రేయర్ లేట్ అవుతున్నదని, వెంటనే ఆమెను తొలగించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న జిల్లా కోఆర్డినేటర్ సుస్మిత విచారణ చేపట్టి ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆర్సీవో అంజలి స్కూల్‌కు వచ్చి వివరాలు తెలుసుకున్నారు. ఆర్సీవో మీడియాతో మాట్లాడుతూ ప్రిన్సిపాల్ మమతను సస్పెండ్ చేస్తూ స్టేట్ ప్రిన్సిపాల్ సెక్రటరీ సైదులు ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలిపారు. ఆమె స్థానంలో ఇన్చార్జి ప్రిన్సిపాల్‌గా చైతన్యను నియమించినట్టు పేర్కొన్నారు.