సూర్యాపేట : రాజకీయ పరిణతి, అనుభవంలేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) పాలనలో ప్రజలకు కష్టాలు తప్పవని ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ చైర్పర్సన్ డాక్టర్ లక్ష్మీపార్వతి (Laxmi Parvathy) అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా నడిగూడెంలో రాజావారి కోటలో కన్నెగంటి వేణు ప్రసాద్ చిత్ర పటానికి పూలమాల వేసిన అనంతరం కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు స్వతంత్రంగా వ్యవహరించే పరిస్థితి ఉండదని, ప్రతి చిన్న అంశానికి ఢిల్లీ పెద్దల సూచనలు సలహాలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. దీంతోపాటు ప్రజల సమస్యలు పరిష్కారం చేయడం ఎన్నికల్లో విమర్శించినంత సులభం కాదన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేశారని కొనియాడారు.
ముఖ్యంగా రైతాంగాన్ని ఆర్థికంగా ఆదుకున్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు. భూగర్భ జల వనరులు పెరిగేందుకు మిషన్ కాకతీయ పేరుతో చెరువుల పూడిక తీయించారని పేర్కొన్నారు. మిషన్ భగీరథతో ప్రతి ఇంటికి నల్లాల ద్వారా స్వచ్ఛమైన నీటిని అందించిన చరిత్ర కేసీఆర్‌ది అన్నారు.