దేశంలో అసహనం అత్యున్నత స్థాయికి చేరుకున్నది. దీనికి నిన్న సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ గవాయ్‌పై దాడి జరగడం ఒక దారుణమైన సంకేతం. ఇలాంటి దాడులు ప్రజాస్వామ్యం మూలాలకే ముప్పు కలిగిస్తాయి.
-కేటీఆర్
హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ) : సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ గవాయ్‌పై దాడి.. న్యాయవ్యవస్థపై జరిగిన దాడి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ‘దేశంలో అసహనం అత్యున్నత స్థాయికి చేరుకున్నది. దీనికి నిన్న సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ గవాయ్‌పై దాడి జరగడం ఒక దారుణమైన సంకేతం. ప్రధాన న్యాయమూర్తిపై జరిగిన దాడి యత్నాన్ని తీవ్రంగా, నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నా. న్యాయవ్యవస్థ గౌరవంపై జరిగిన ఈ సిగ్గుచేటైన దాడి కేవలం ఒక వ్యక్తిపై దాడి కాదు. ఆ వ్యవస్థపైనే జరిగిన దాడి. విశ్వాసం, మతం వంటి సున్నితమైన అంశాలపై ఎలాంటి విభేధాలు ఉన్నా హింసను సమర్థించొద్దు. ఇలాంటి దాడులు ప్రజాస్వామ్యం మూలాలకే ముప్పు కలిగిస్తుంది’ అని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
న్యాయవాదుల ఖండన
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్‌పై ఓ న్యాయవాది దాడి యత్నాన్ని తెలంగాణ రాష్ట్ర బార్‌కౌన్సిల్, హైకోర్టు న్యాయవాదుల సంఘం, బీజేపీ లీగల్‌సెల్ తీవ్రంగా ఖండించాయి. హైకోర్టు ఆవరణలోని బార్‌కౌన్సిల్ గేటు వద్ద మంగళవారం న్యాయవాదులు నిరసన తెలిపారు. సుప్రీంకోర్టు సీజేపై దాడి చేసిన న్యాయవాది మీద చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీజేఐపై దాడి రాజ్యాంగంపై జరిగిన దాడిగా టీపీసీసీ లీగల్‌సెల్ చైర్మన్ పొన్నం అశోక్‌గౌడ్ పేర్కొన్నారు. దాడిని బార్‌కౌన్సిల్ చైర్మన్ నర్సింహారెడ్డి ఒక ప్రకటనలో ఖండించారు.
రెచ్చగొట్టే ప్రసంగాల వల్లే : వినోద్
‘రాజకీయ పార్టీలు, కొన్ని సంఘాల నేతల రెచ్చగొట్టే ప్రసంగాలే దాడులకు, దౌర్జన్యాలకు ప్రేరణగా నిలుస్తున్నాయి. తాజాగా సీజేఐపై దాడికి కూడా ఇలాంటివే కారణాలు’ అని బీఆర్ఎస్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ ఒక ప్రకటనలో అభిప్రాయపడ్డారు. కొందరు నేతలు విద్వేషపూరిత భావాలను వ్యక్తపరుస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నారని, అందుకే ఇలాంటి దాడులు చేయాలన్న ఆలోచనలు వారి అనుచరులకు వస్తున్నాయని వివరించారు. ఇకనైనా ప్రధాన రాజకీయ పక్షాలు తమ తీరును మార్చుకోవాలని, రాజ్యంగ పరిరక్షణకు కట్టుబడి ఉండాలని, నాయకులు సంయమనంతో వ్యవహరించాలని హితవు పలికారు. అమాయక ప్రజలను రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేయొద్దని కోరారు. ఇలాంటి ఘ టనలు పునరావృతం కాకుండా ఉండాలంటే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు సీజేఐ బీఆర్ గవాయ్‌పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఆయన తెలిపారు.