మహబూబ్నగర్ : రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా న్యాయావాదులపై దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయని, అటువంటి దాడుల జరగకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవచూపాలని మహబూబ్నగర్ న్యాయవాద సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీధర్ రావు కోరారు. కూకట్పల్లి న్యాయవాద సంఘంలోని ఓ న్యాయవాది విధులను అడ్డుకొని, అతనిపై విచక్షణారహితంగా దాడి చేసిన ఘటనను నిరసిస్తూ మంగళవారం న్యాయవాదులు విధులను బహిష్కరించారు.
మహబూబ్నగర్ జిల్లా కేంద్రమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదులు విధులను బహిష్కరించడం జరిగిందని ఆయన తెలిపారు. ప్రతిరోజు న్యాయవాదులపట్ల దాడులు పెరిగిపోతున్నాయని, అటువంటి దాడులను అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. న్యాయవాదులకు రక్షణగా ప్రభుత్వం వెంటనే రక్షణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో న్యాయవాదులపై దాడులు జరిగితే సహించేది లేదని హెచ్చరించారు.
న్యాయవాదిపై దాడికి బాధ్యులైన వారందరిపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ పంపాలని డిమాండ్ చేశారు. న్యాయవాద సంఘం మాజీ అధ్యక్షుడు చంద్రమౌళి, సీనియర్ న్యాయవాది ఎంపీ వెంకటేశ్ మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని న్యాయవాద రక్షణ చట్టాన్ని వెంటనే తీసుకురావాలని డిమాండ్ చేశారు. బాధ్యతాయుతమైన న్యాయవాద వృత్తిలో ఉన్న న్యాయవాదుల పట్ల అమానుషంగా ప్రవర్తించడం సరికాదన్నారు.
భవిష్యత్తులో న్యాయవాదులపై దాడులు జరగకుండా రాసిన బాధ్యత ప్రభుత్వానిదని అన్నారు. కార్యక్రమంలో కోశాధికారి వెంకట్రావు, కార్యవర్గ సభ్యులు, సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.