HCU | హైదరాబాద్, ఏప్రిల్ 2(నమస్తే తెలంగాణ): కంచ గచ్చిబౌలి భూముల్లో భారీగా వృక్ష సంపద, వన్యప్రాణులకు జరుగుతున్న నష్టంపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ ఆదేశించింది. ఈ మేరకు ఆ శాఖ సహాయ ఇన్స్పెక్టర్ జనరల్ ఎస్. సుందర్ బుధవారం రాష్ట్ర ప్రభుత్వ అటవీశాఖ అదనపు కార్యదర్శికి లేఖ రాశారు. టీజీఐఐసీ ఆధ్వర్యంలో కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల్లో అక్రమంగా చెట్లను తొలగించి వృక్ష సంపదను ధ్వంసం చేసినట్టు తమకు సమాచారం అందిందని ఆ లేఖలో పేర్కొన్నారు.
చెరువులు, వన్యప్రాణులు, ప్రకృతిసిద్ధంగా ఏర్పడిన రాతి నిర్మాణాలకు నష్టం జరుగుతున్నట్టు మీడియాలో వార్తలు వచ్చినట్టు చెప్పారు. దీనిపై ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రిని కలిసి వినతిపత్రాలు కూడా సమర్పించారని తెలిపారు. ఈ నేపథ్యంలో దీనిపై వెంటనే వాస్తవ నివేదికను సమర్పించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. పర్యావరణ నిబంధనలు, చట్టాలు, కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరించరాదని, పర్యావరణ చట్టాలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని లేఖలో స్పష్టంచేశారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ)లో న్యాయవాది కారుపోతుల రేవంత్ బుధవారం ఫిర్యా దు చేశారు. హెచ్సీయూకి చెందిన 400 ఎకరాల భూమి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి పునరాలోచన చేయడం లేదని, అందుకే చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఫిర్యాదు చేశామని వెల్లడించారు. హెచ్సీయూ భూముల వేలం అనైతికమని, వెంటనే ఈ ప్రక్రియను అడ్డుకొని పర్యావరణాన్ని పరిరక్షించాలని ఫిర్యాదులో కోరినట్టు వెల్లడించారు.
పారిశ్రామిక అభివృద్ధి పేరిట పచ్చని చెట్లు, వివిధ రకాల జీవరాశులతో చకటి వైవిధ్యం కలిగిన భూముల్లో ప్రభుత్వమే చెట్లను నరికి వేయడం అవివేకమైన చర్య అని పేర్కొన్నారు. ఈ 400 ఎకరాల భూమి హైదరాబాద్కు కొంతమేర కాలుష్యం నుంచి ఉపశమనం కలిగిస్తున్నదని తెలిపారు. ఇలాంటి పర్యావరణ ప్రాంతాలను ధ్వంసం చేయడం మంచిది కాదని ప్రభుత్వానికి హితవు పలికారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో న్యాయపరంగా కొట్లాడతామని, ఈ అంశంలో న్యాయంజరిగే వరకు పోరాడుతానని ఆయన స్పష్టం చేశారు.