హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ) : హైకోర్టులో గురువారం మధ్యా హ్నం ఓ న్యాయవాది హఠాన్మరణం చెందారు. పర్సా అనంత నాగేశ్వర్రావు (47) కోర్టు హాల్‌వద్ద కుర్చీలో కూర్చొని అకస్మాత్తుగా తలవాల్చేశారు. ఎదురుగా ఉన్న క్లయింట్ గమనించి చుట్టుపక్కనున్న వారిని అప్రమత్తం చేశారు. న్యాయవాదులు, కోర్టు సిబ్బంది వెంటనే ఆయనను అంబులెన్స్‌లో ఉస్మానియా దవాఖనకు తరలించారు. అప్పటికే ఆయన మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. కార్డియాక్ అరెస్ట్ (గుండె ఆగిపోవడం) కారణంగా మరణించి ఉంటారని తెలిపారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాగేశ్వర్రావు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిగా పనిచేశారు. డిగ్రీ ముగిశాక ఉమ్మడి ఏపీ హైకోర్టులో అడ్వకేట్ క్లర్‌గా ఆయన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. ఓ వైపు క్లర్క్‌గా పనిచేస్తూనే న్యాయశాస్ర్తాన్ని పూర్తి చేసి అదే హైకోర్టులో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. ప్రభుత్వ సహాయ న్యాయవాది, ప్రభుత్వ న్యాయవాది, ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిగా సమర్ధంగా సేవలందించారు. ఆయనకు భార్య, ఇంటర్మీడియట్ చదివే కుమారుడు, 9వ తరగతి చదివే కుమార్తె ఉన్నారు. షేక్‌పేట్‌లోని గృహంలో మృతదేహానికి న్యాయమూర్తి పుల్లా కార్తీక్, పలువురు సీనియర్ న్యాయవాదులు, అడ్వకేట్ క్లర్స్ పెద్ద సంఖ్యలో నివాళులర్పించారు. జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో శుక్రవారం అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు.