జడ్చర్లటౌన్, జూన్ 15 : ప్రమాదవశాత్తు చెరువులో జారిపడి ఓ న్యాయవాది మృతి చెందారు. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం కావేరమ్మపేటలో ఆదివారం చోటుచేసుకున్నది. జడ్చర్ల సీఐ కమలాకర్ కథనం ప్రకారం.. కావేరమ్మపేటకు చెందిన న్యాయవాది గుండు తిరుపతయ్య (55) ఆదివారం ఉదయం చేపలు పట్టేందుకు పట్టణ శివారులోని నల్లచెరువుకు వెళ్లారు. చేపలు పట్టే క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి నీటిలో పడి మునిగాడు.
అతని తలకు బలమైన గాయాలు తగలడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. కొద్దిసేపటి తర్వాత స్థానికులు, కుటుంబ సభ్యులు గుర్తించి చెరువు నీటిలో నుంచి మృతదేహాన్ని బయటకు తీసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. జడ్చర్ల పోలీసులు వచ్చి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. మృతుడి భార్య విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.