హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్.. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న ‘నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్’ (ఎన్సీఎల్ఏటీ)లో కేఎల్ఎస్ఆర్పై ‘కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియ’ (సీఐఆర్‌పీ) కింద కేసు విచారణ జరుగుతున్నది. అయితే ఈ కేసును విచారిస్తున్న న్యాయమూర్తి తాజాగా సంచలన ఆరోపణలు చేశారు.
‘ఈ కేసులో ఒకరికి అనుకూలంగా తీర్పు ఇవ్వాలని దేశంలోని అత్యున్నత న్యాయాధికారుల్లో ఒకరు నాపై ఒత్తిడి తెస్తున్నారు. అందుకే ఈ కేసు విచారణ నుంచి తప్పుకుంటున్నాను’ అని జస్టిస్ శరద్ కుమార్ శర్మ ఆరోపించారు. మరోవైపు ఈ కంపెనీకి రాష్ట్రంలోని అధికారకాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ముఖ్యనేతతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు వార్తలు గుప్పుమన్నాయి. దీంతో కేఎల్ఎస్ఆర్ వ్యవహారం ఒకేసారి వ్యాపార, రాజకీయ, న్యాయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. ఈ తతంగం వెనుక రాజకీయ ‘హస్తం’ ఉన్నదేమో అని అనుమానాలు తలెత్తుతున్నాయి.
అసలు వివాదం ఇదీ..
కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ సంస్థ, ఏఎస్ మెట్ కార్పొరేషన్ సంస్థల మధ్య ఆర్థిక లావాదేవీలకు సంబంధించి వివాదం తలెత్తింది. దీంతో ఏఎస్ మెట్ సంస్థ 2023 జూలై 14న హైదరాబాద్‌కు చెందిన ‘నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్'(ఎన్సీఎల్టీ)ని ఆశ్రయించింది. విచారణ అనంతరం కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ కంపెనీ బోర్డును సస్పెండ్ చేస్తూ ట్రిబ్యునల్ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. వివాద పరిష్కారానికి తాత్కాలికంగా ఒక నిపుణుల కమిటీని నియమించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సస్పెండ్ అయిన బోర్డు డైరెక్టర్ ఏఎస్రెడ్డి చెన్నైలోని ఎన్సీఎల్ఏటీని ఆశ్రయించారు. జస్టిస్ శరద్‌కుమార్ శర్మ, టెక్నికల్ మెంబర్ జితేంద్రనాథ్తో కూడిన ధర్మాసనం వాదనలు విన్నది. ఈ ఏడాది జూన్ 18న తుది వాదనలు జరిగాయి. అనంతరం ధర్మాసనం తీర్పును రిజర్వ్‌చేసింది.
ఈ నెల 13వ తేదీన తుది తీర్పు ఇవ్వాల్సి ఉన్నది. అయితే.. అకస్మాత్తుగా ఈ కేసు విచారణ నుంచి తాను తప్పుకుంటున్నట్టు ఈ నెల 13న ట్రిబ్యునల్ ప్రకటించింది. ‘ధర్మాసనంలోని ఒక జ్యుడీషియల్ సభ్యుడిని ఈ దేశంలోని ఉన్నత న్యాయవ్యవస్థకు చెందిన అత్యంత గౌరవనీయ సభ్యుల్లో ఒకరు సంప్రదించి, ఈ కేసులో ఒకరికి అనుకూలంగా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఈ పరిణామాలు మాకు బాధ కలిగించాయి. అందుకే ఈ కేసు విచారణన నుంచి తప్పుకుంటున్నాం’ అని ధర్మాసనం ప్రకటించింది. కొత్త బెంచ్‌కు ఈ కేసును అప్పగించాలని కోరింది. ఈ ధర్మాసనంలోని జ్యుడీషియల్ సభ్యుడైన జస్టిస్ శర్మ ఉత్తరాఖండ్ హైకోర్టు న్యాయమూర్తిగా 2023 డిసెంబర్ 31న పదవీ విరమణ చేశారు. ఎన్సీఎల్ఏటీలో 2024 ఫిబ్రవరి 19న చేరారు. తాజా పరిణామాలు న్యాయవర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి.
కాంగ్రెస్ ముఖ్యనేతకు సంబంధాలు..
సంచలన ఆరోపణల నేపథ్యంలో కేఎల్ఎస్ఆర్ కంపెనీ గురించి అటు కార్పొరేట్ వర్గాల్లో, ఇటు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ మొదలైంది. కంపెనీ వ్యవహారాలపై కొందరు లోతుగా ఆరా తీయగా అధికార కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు తేలిందని చెప్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ నేత కేఎల్ఎస్ఆర్ కంపెనీకి చెందిన కారునే వాడినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు ఆధారాలు అంటూ కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కంపెనీ నుంచి ఆర్థిక సాయం కూడా పొందారని చర్చ జరుగుతున్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కంపెనీకి ప్రభుత్వం తరఫున పలు కాంట్రాక్టులు దక్కాయని చెప్పుకుంటున్నారు. దివాలా ఆరోపణలు ఎదుర్కొంటున్న కంపెనీకి కాంట్రాక్టులు దక్కడానికి ముఖ్యనేతతో పాత పరిచయాలే కారణమని గుసగుసలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ నేతలు సైతం ఈ అంశంపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఏది ఏమైనా దేశవ్యాప్తంగా రాజకీయ, న్యాయ, కార్పొరేట్ వర్గాల్లో చర్చనీయాంశం అయిన ఈ వ్యవహారం లోగుట్టు పెరుమాళ్లకు ఎరుక! అని, త్వరలోనే వివరాలన్నీ బయటికి వస్తాయని ఆశిస్తున్నారు.