మలక్‌పేట, నవంబర్ 25 : కన్సల్టెన్సీలో పనిచేస్తున్న తమ కూతురిని పని ఉన్నదని పిలిచి లైంగికదాడితోపాటు హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపిస్తూ సోమవారం మధ్యాహ్నం మృతురాలి కుటుంబసభ్యులు, బంధువులు, గిరిజన సంఘాలు ఆందోళనకు దిగారు. దీంతో ట్రాఫిక్ భారీగా స్తంభించింది. పోలీసులు రంగంలోకి ఆందోళన విరమింపజేశారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం, తక్రాజ్గూడతండాకు చెందిన ఇస్లావత్ రమేశ్‌నాయక్‌కు ఇద్దరు కూతుళ్లు ఇస్లావత్ శ్రావ్య(20), శ్రుతి, కుమారుడు సాయికిరణ్ ఉన్నారు. పెద్ద కూతురు శ్రావ్య ఎల్బీనగర్ చిత్రా లేఅవుట్లోని మహాత్మాగాంధీ లా కాలేజీలో ఎల్ఎల్బీ ఫోర్త్ ఇయర్ చదువుతూ ఎల్బీనగర్ మెట్రోస్టేషన్ పక్కన గర్ల్స్ హాస్టల్లో ఉంటుంది. లా చదువుతూనే మూసారంబాగ్ సలీంనగర్‌లోని నందిని రెసిడెన్స్ అపార్ట్మెంట్లో అడ్వకేట్ వద్ద ఏడాదిన్నరపాటు పనిచేసింది. మూడు నెలలక్రితం అదే అపార్ట్మెంట్లో జైదుర్గ కన్సల్టెన్సీలో(ఎడ్యుకేషనల్)నిర్వాహకుడు నవీన్ వద్ద మూడు నెలలుగా పనిచేస్తున్నది.
ఆదివారం సాయంత్రం కన్సల్టెన్సీకి వెళ్లిన శ్రావ్య తన తమ్ముడికి ఫోన్‌చేసి డబ్బులు పంపమనగా రూ.20 వేలు ట్రాన్స్ఫర్ చేశాడు. ఆ తర్వాత ఏడున్నరకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవటంతో ఆందోళనకు గురైన అతను శ్రావ్యతోపాటు హాస్టల్లో ఉంటున్న బంధువు శిరీషకు ఫోన్‌చేసి వాకబ్ చేయమన్నాడు. శిరీష విషయాన్ని మరో ఫ్రెండ్ సోనీకి తెలిపింది. సోనీ తన స్నేహితుడు కార్తీక్‌తో కలిసి కన్సల్టెన్సీకి వెళ్లారు. అక్కడ అడ్వకేట్ సామల రవీందర్‌తోపాటు గ్రౌండ్‌ఫ్లోర్‌లోని మరో మహిళతో వెళ్లి కార్యాలయం ముందు శ్రావ్య చెప్పులను గమనించి తలుపులు తట్టిచూడగా లోపలివైపు గడియపెట్టి ఉంది. కిటికీలోంచి తొంగిచూడగా శ్రావ్య సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. శ్రావ్యను అడ్వకేట్ రవీందర్ కారులో మలక్‌పేట యశోద దవాఖానకు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించి మలక్‌పేట పోలీసులకు సమాచారమిచ్చారు. ఎస్సై సురేశ్ కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. రాత్రి 10 గంటలకు మృతురాలి తల్లిదండ్రులకు సమాచారమివ్వ గా వారు బంధువులతో నగరానికి వచ్చారు.
కన్సల్టెన్సీ కార్యాలయానికి లెగ్ఇన్తో వెళ్లిన శ్రావ్య ఒంటిపై లెగ్ఇన్ లేకపోవడం, ఫ్యాన్‌కు వేలాడుతూ ఉన్న గదిలో రక్తపు మరకలు ఉండటం పలు అనుమానాలకు తావిస్తున్నదని మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు, గిరిజన సంఘాల నాయకులు ఆరోపించారు. కన్సల్టెన్సీ నిర్వాహకుడు నవీన్, అతని అనుచరుడు కలిసి శ్రావ్యపై లైంగికదాడి, హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని మృతురాలి తల్లిదండ్రులు ఇస్లావత్ రమేశ్‌నాయక్, కంసీ, వారి బంధువులు ఆరోపించారు. లెగ్ఇన్తో వచ్చిన శ్రావ్య ఒంటిపై లెగ్ఇన్ లేకపోవటం, నిర్వాహకులు కనిపించకపోవడం ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయని రాష్ట్ర గిరిజన లాయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్‌నాయక్, ఉపాధ్యక్షుడు సంతోష్‌నాయక్, కోశాధికారి బాలునాయక్, సంయుక్త కార్యదర్శి జామ్లానాయక్, రాష్ట్ర గిరిజన మహిళా లాయర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు లలితానాయక్ పేర్కొన్నారు. ఈ ఘటనపై దర్యాప్తుచేసి నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు.
కన్సల్టెన్సీ నిర్వాహకులు లైంగికదాడి, హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. మృతురాలి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. బాధిత కుటుంబానికి రూ.కోటి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి.