హైదరాబాద్, జూన్6 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజులు తక్షణం నియంత్రించాలని, అందుకోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని పీడీఎస్‌యూ, పీవైఎల్ నేతలు డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్‌నంబర్ 12లో మినిస్టర్స్ క్వార్టర్స్‌ను ముట్టడించి మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు యత్నించారు. ఈ సందర్భంగా పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు కంపాటి పృథ్వీ, పీవైఎల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్వీ రాకేశ్ మాట్లాడుతూ ఫీజుల నియంత్రణ చట్టాన్ని తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేశారు.
పెండింగ్ రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని, అనుమతుల్లేని ప్రైవేట్ విద్యాసంస్థలను మూసివేయాలని కోరారు. విద్యాహకు చట్టం ప్రకారం ప్రైవేట్ విద్యాసంస్థల్లో పేదలకు 25శాతం సీట్లు ఇవ్వాలని, బ్రాంచీలు ఏర్పాటు చేసే విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ ప్రధాన కార్యదర్శి అనిల్, ఉపాధ్యక్షుడు నరేందర్, సహాయ కార్యదర్శి గణేశ్ తదితరులు పాల్గొన్నారు.