హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ మాన్సూన్ రెగెట్టా చాంపియన్షిప్లో తెలంగాణ సెయిలర్లు అదరగొట్టారు. హుసేన్సాగర్ వేదికగా శనివారం ముగిసిన టోర్నీలో ఆతిథ్య తెలంగాణ నాలుగు స్వర్ణాలు సహా 15 పతకాలను ఖాతాలో వేసుకున్నది. ఆఖరి రోజు జరిగిన అండర్-16 బాలికల విభాగంలో రాష్ట్ర యువ సెయిలర్ రమీజాభాను పసిడి పతకంతో మెరిసింది. బాలుర-16 కేటగిరీలో డిఫెండింగ్ చాంపియన్ రవికుమార్ బెన్నెవోలు రెండు రేసుల్లో గెలిచి ప్రతిష్టాత్మక మాన్సూన్ రెగెట్టా ట్రోఫీతో పాటు ఎస్హెచ్ బాబు స్మారక ట్రోఫీని దక్కించుకున్నాడు. ఇలా ఒకే టోర్నీలో రెండు ట్రోఫీలు సాధించిన అరుదైన రికార్డును రవికుమార్ సొంతం చేసుకున్నాడు. ఈ ఇద్దరు ఈనెల ఆఖర్లో మొరాకోలో జరిగే ప్రపంచ చాంపియన్షిప్నకు భారత్ తరఫున ఎంపికయ్యారు. మరోవైపు వేర్వేరు విభాగాల్లో నరసింహకు రజతం, నీలకొండ మణి కాంస్య పతకా లు సాధించారు. అండర్-18 ఇంటర్నేషనల్ 420 మిక్స్డ్ క్లాస్లో బద్రీనాథ్, రిశ్విక జోడీ స్వర్ణం కైవసం చేసుకుంది.