జవహర్‌నగర్/ ఉస్మానియా యూనివర్సిటీ, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్‌లో నేరగాళ్లు తుపాకులు, కత్తులతో హత్యలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. జవహర్‌నగర్‌లో ఒక రియల్టర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు పట్టపగలు కాల్చి చంపారు. రెండు మూడు గంటల వ్యవధిలోనే సికింద్రాబాద్‌లో తల్లిముందు కూతురును గొంతుకోసి ఓ కిరాతకుడు హతమార్చాడు. ఈ రెండు ఘటనలు సోమవారం హైదరాబాద్‌లో తీవ్ర సంచలనం సృష్టించాయి. హైదరాబాద్‌లో శాంతి భద్రతలు రోజురోజుకూ దిగజారుతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే జవహర్‌నగర్ కార్పొరేషన్ సాకేత్ కాలనీలో వెంకటరత్నం(46) భార్య, ఇద్దరు కూతుళ్లతో కలిసి నివసిస్తున్నాడు.
వెంకటరత్నం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం ఉదయం కూతురును పాఠశాలలో వదిలి ఇంటికి వస్తుండగా మార్గమధ్యంలో నడిరోడ్డుపై ఐదుగురు గుర్తుతెలియని దుండగులు వెంబడించి కత్తులతో తల, మెడ భాగాల్లో పొడిచి, గన్‌తో కాల్చి చంపారు. అనంతరం దుండగులు పెద్దగా అరుస్తూ ఆటోలో నలుగురు, బైక్ మీద ఒకరు అక్కడి నుంచి పరారయ్యారు. మృతుడు కొన్నేండ్ల క్రితం ధూల్‌పేట ప్రాంతంలో రౌడీషీటర్లతో సన్నిహితంగా ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కొన్ని హత్యలు, ఆర్థిక వివాదాల నేపథ్యంలో ప్రతీకార చర్యల్లో భాగంగానే హత్య జరిగినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. జవహర్‌నగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. ఘటన స్థలాన్ని డీసీపీ శ్రీకాంత్ పరిశీలించారు.
ముషీరాబాద్ డివిజన్ బాపూజీనగర్‌లో నివసించే కాంతారావు, లక్ష్మి దంపతుల కూతురు పవిత్ర (19) ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఇంట్లోనే ఉంటున్నది. పవిత్రకు వరుసకు బావ అయ్యే రహమత్‌నగర్‌కు చెందిన ఉమాశంకర్ పవిత్రను పెండ్లి చేసుకుంటానని ఆమె తల్లిదండ్రులకు చెప్పాడు. అతని ప్రవర్తన నచ్చని వారు నిరాకరించారు. సోమవారం మధ్యాహ్నం ఇంట్లో తల్లీకూతుళ్లు ఉన్న సమయంలో వచ్చిన ఉమాశంకర్.. పవిత్రతో వివాహం ఎందుకు చేయరంటూ వాదించాడు. వెంట తెచ్చుకున్న కత్తితో పవిత్ర గొంతుకోసి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడ్డ పవిత్ర దుర్మరణం పాలైంది.