హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విరుచుకుపడ్డారు. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో తాజా నివేదికే ఇందుకు సాక్ష్యమని స్పష్టంచేశారు. లా అండ్ ఆర్డర్‌ను కాపాడేందుకు వినియోగించాల్సిన పోలీసు, ఇంటెలిజెన్సీ వ్యవస్థలను రాజకీయ కక్ష సాధింపునకు వాడుకోవడం, ప్రశ్నించిన వారిపై ప్రయోగించి దుర్వినియోగం చేసిన ఫలితంగానే రాష్ట్రంలో ఈ దుస్థితి నెలకొన్నదని పేర్కొన్నారు. రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న హింసాత్మక ఘటనలపై కేటీఆర్ శుక్రవారం ఎక్స్ వేదికగా స్పందించారు. రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పాలనతో రాష్ట్రంలో శాంతిభద్రతలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయని ఆందోళన వ్యక్తంచేశారు.
నిత్యకృత్యంగా మారిన హింసాత్మక ఘటనలతో తెలంగాణ ప్రజలు భయాందోళనలో బతుకుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. శాంతి భద్రతల పరిస్థితిపై బీఆర్ఎస్ బృందం డీజీపీని కలిసిన సమయంలోనే హైదరాబాద్‌లో రిటైర్డ్ డీజీ ర్యాంక్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్‌రాయ్ భార్య దారుణంగా హత్యకు గురైన వార్త రావడం.. మొన్న రాత్రి సికింద్రాబాద్‌లో ఓ యువకుడిని నడిరోడ్డుపై కిరాతకంగా కత్తులతో పొడిచి చంపిన ఘటనలతో నగర జనం కలవరపాటుకు గురైందని పేర్కొన్నారు. ఇలాంటి హింసాత్మక ఘటనలు సామాన్య పౌరుల్లో పెరుగుతున్న అభద్రతాభావానికి అద్దంపడుతున్నాయని తెలిపారు. నేరాల నియంత్రణకు వాడుకోవాల్సిన పోలీసులను రాజకీయ కక్ష సాధింపులు, ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నించిన సోషల్ మీడియా వారియర్స్ గొంతునొక్కేందుకు వినియోగించడంతోనే శాంతి భద్రతలు గాడితప్పుతున్నాయని పేర్కొన్నారు.
ప్రజలకు భరోసా కల్పించాలి..
దోపిడీలు, దొంగతనాలు, హత్యలు, మానభంగాలను నిలువరించాల్సిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చోద్యం చూస్తూ పబ్బంగడుపుతున్నారని కేటీఆర్ విమర్శించారు. ఇకనైనా కండ్లు తెరువాలని చురకలంటించారు. తక్షణమే రాజకీయ వేధింపులు బంద్‌పెట్టి పోలీసు వ్యవస్థను పటిష్టంచేసి ప్రజల భద్రతకు భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. లేదంటే నాలుగుకోట్ల తెలంగాణ ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.