ఖమ్మం : అశ్రునయనాల మధ్య ఎఫ్ఆర్వో శ్రీనివాసరావు అంత్యక్రియలు ముగిశాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం బెండాలపాడు గ్రామ పరిధి అటవీ ప్రాంతంలో గుత్తి కోయల దాడిలో ఎఫ్ఆర్వో మృత్యువాతపడ్డ విషయం తెలిసిందే. ప్రభుత్వ లాంఛనాల మధ్య ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం మండలం ఈర్లపుడి గ్రామంలో శ్రీనివాస రావు అంత్యక్రియలు జరిగాయి. మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, సీఎంవో అధికారులు స్మితా సబర్వాల్, ప్రియాంక వర్గీస్ నివాళులర్పించారు.
ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. శ్రీనివాసరావుపై దారుణంగా దాడి చేసి హత్య చేసిన నిందితులను వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందన్నారు. ఇక్కడి గిరిజనులతో సమస్య లేదని, ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడ అక్రమంగా వలస వచ్చిన గుత్తి కోయలు అడవులను విచక్షణ రహితంగా నరికి వేస్తున్నారని, అడవులను నరికినట్లు అటవీ అధికారులను నరుకుతం, దాడులు చేస్తాం అంటూ ఊరుకునేది లేదని ఈ దారుణానికి ఒడిగట్టిన వారిని వదిలి పెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.