హైదరాబాద్ సిటీబ్యూరో/ ఖైరతాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): వారు తాతల కాలం నుంచి అక్కడే నివాసం ఉంటున్నారు. రెకాడితేగానీ డొకాడని బతుకులు వారివి! ఓటర్ ఐడీలు ఉన్నాయి, ఆధార్ కార్డులు ఉన్నాయి, ఏటా ప్రభుత్వానికి పన్నులు కడుతున్నారు, నల్లా కనెక్షన్లు, కరెంట్ బిల్లులు చెల్లిస్తున్నారు. ఐదు దశాబ్దాలుగా ఆ ప్రాంతమే వారి ప్రపంచం. కానీ, రాత్రికి రాత్రే వారంతా ‘ఆక్రమణదారులు’ అయిపోయారు. హుస్సేన్ సాగర్ ఎఫ్టీఎల్ పేరిట దూసుకొస్తున్న ‘హైడ్రా’ బుల్డోజర్లు ఆ నిరుపేద బస్తీ వాసుల గుండెల్లో గుబులు రేపుతున్నది. తమ గూడును ఎకడ కూల్చేస్తారో అన్న భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలోని సోమాజిగూడ డివిజన్ ఎంఎస్ మక్తా, బీఎస్ మక్తా బస్తీ ప్రజల కన్నీటిగాథ ఇది.
హైడ్రా ‘గో బ్యాక్’
హైడ్రాను వ్యతిరేకిస్తూ శుక్రవారం పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి కన్నీటి నిరసనలు తెలిపారు. హైడ్రా కఠిన వైఖరిని, వెనుకుండి నడిపిస్తున్న ప్రభుత్వ కుట్రలకు వ్యతిరేకంగా బీఎస్ మక్తా, ఎంఎస్ మక్తావాసులు నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్ వద్ద భారీ ఎత్తున రోడ్డుపై బైఠాయించారు. ‘మా బతుకులు కూల్చవద్దు’, ‘పేదల ఇండ్లు కూల్చేందుకు ప్రభుత్వం కుట్రలు సాగనివ్వం’ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల దాకా అన్ని వయసు వర్గాలవారు పాల్గొని ప్లకార్డులు ప్రదర్శించారు. ‘మేము నిన్న మొన్న వచ్చిన వాళ్లం కాదు. 50 ఏండ్లకుపైగా ఇకడే బతుకుతున్నం. అప్పట్లో లేని ఎఫ్టీఎల్, బఫర్ జోన్ రూల్స్ ఇప్పుడెలా వచ్చినయ్?’ అంటూ ప్రశ్నించారు. రెకలు ముకలు చేసుకొని సంపాదించి.. కాస్తో కూస్తో కూడబెట్టుకొని తలదాచుకోవడానికి చిన్న ఇల్లు కట్టుకుంటే, ఇప్పుడు నోటీసులు అంటూ కూల్చేస్తామనడం ఎంతవరకు న్యాయమని ప్రభుత్వాన్ని నిలదీశారు. ‘కూలీనాలీ చేసుకునే మా బతుకులను రోడ్డున పడేయకండి. మా బస్తీలకు బుల్డోజర్లు వస్తే ప్రాణాలైనా అడ్డుపెడుతాం కానీ ఇండ్లను తాకనివ్వం’ అంటూ తేల్చి చెప్పారు. గంటల తరబడి రోడ్డుపైనే బైఠాయించడంతో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. తాము చట్ట వ్యతిరేకులం కాదని, ఓట్ల కోసం వాడుకొని ఇప్పుడు ఇండ్లు కూల్చాలని చూడటం ఎంతవరకు న్యాయమని ఈ సందర్భంగా నిలదీశారు. ‘హైడ్రా గో బ్యాక్’ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేయడంతో రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు హోరెత్తాయి. రైలు రోకోకు సైతం స్థానికులు యత్నించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నిరసన ప్రదర్శన కారణంగా రాజ్ భవన్ రోడ్, నెక్లెస్ రోడ్ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నిరసనకారులను అడ్డుకున్నారు. వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం పేదల ఇండ్లకు ఎలాంటి నష్టం చేయదని స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు తమ పోరాటం ఆగదని బస్తీవాసులు తేల్చి చెప్పారు.
రోడ్డు విస్తరణ పేరుతో కుట్రలు
ఎంఎస్ మక్తా, బీఎస్ మక్తాలోని పలు భవనాలకు ఇటీవల హైడ్రా నోటీసులు జారీ చేసింది. ఇక్కడ రోడ్డు విస్తరణ చేపడుతున్నామని, తక్షణమే వివరణ ఇవ్వాలని, లేనిపక్షంలో కూల్చివేస్తామన్నది వాటి సారాంశం. భవనాల చుట్టూ మెజారిటీగా వందల సంఖ్యలో పేదల ఇండ్లు ఉన్నాయి. ఆయా కుటుంబాలు సుమారు 50 ఏండ్లుగా ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని జీవిస్తున్నాయి. క్రమం తప్పకుండా ఆస్తి, నీటి పన్నులు, కరెంటు బిల్లులు చెల్లిస్తున్నాయి. మరికొందరు అప్పులు చేసి మరీ ఇండ్లు కట్టుకున్నారు. బీఎస్ మక్తాలోని సుబానీ మసీదు నుంచి హరిగేట్ వరకు ఇండ్లను హైడ్రా మ్యాప్‌లో చూపిస్తున్నారంటూ బస్తీవాసులు చెప్తున్నారు. వాస్తవానికి ఎఫ్టీఎల్ చుట్టు పక్కల అనేక నిర్మాణాలు ఉన్నాయని, కానీ కావాలని బీఎస్ మక్తా, ఎంఎస్ మక్తాలను హైడ్రా కూల్చివేత మ్యాప్‌లలో చేర్చారని బస్తీ వాసులు వాపోతున్నారు. అధికార పార్టీకి చెందిన వారి విల్లాలకు దారి వేసేందుకే రోడ్డు విస్తరణ, కూల్చివేతల డ్రామా ఆడుతున్నారని ఆరోపిస్తున్నారు. తమ సమస్యను హైడ్రా అధికారుల దృష్టికి తీసుకువస్తే ‘ఇది ప్రభుత్వ పెద్దల నిర్ణయం. మా చేతుల్లో ఏమి లేదు’ అంటూ బుకాయిస్తున్నారని వాపోతున్నారు. తమకు వేరే చోట్ల ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామంటున్నారని, అవేమీ అవసరం లేదని, ఉన్న ప్రాంతంలోనే ప్రశాంతంగా జీవించే అవకాశం కల్పించాలని కోరుతున్నారు. తమ ఇండ్లు కూల్చివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని బస్తీవాసులు స్పష్టం చేస్తున్నారు.
నిరసనకారులపై కేసులు పెట్టాలని హుకుం
శుక్రవారం సాయంత్రం హైడ్రా అధికారులు బీఎస్ మక్తా, ఎంఎస్ మక్తా బస్తీల్లో పర్యటించినట్టు తెలిసింది. హైడ్రా ఇన్స్పెక్టర్ ఆదిత్య నేతృత్వంలోని అధికారుల బృందం నిరసనకారుల వివరాలు సేకరించేందుకు బస్తీకి వచ్చినట్టు స్థానికులు చెప్తున్నారు. నిరసనలో ఎవరెవరు పాల్గొన్నారు? అని ఆరా తీసినట్టు తెలిపారు. వారిపై కేసులు నమోదు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించినట్టు తెలిసింది.
ఆందోళన చేయించిన వారిపై చట్టపరమైన చర్యలు: రంగనాథ్
ఖైరతాబాద్, రాజ్ భవన్ ఎదురుగా హుస్సేన్ సాగర్‌కు ఆనుకొని ఉన్న ఎంఎస్ మక్తా, బీఎస్ మక్తా నివాసితులకు హైడ్రా భరోసా ఇచ్చింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ శుక్రవారం ఆయా ప్రాంతాల్లో సందర్శించారు. స్థానికులతో నేరుగా మాట్లాడారు. ఈ విషయంలో స్పష్టత ఇచ్చేందుకే తాను ఇకడికి వచ్చానని చెప్పారు. పేదల ఇండ్లను కూల్చేది లేదని స్పష్టంచేశారు. రాష్ట్ర ప్రభుత్వ విధానం కూడా ఇదే అని తెలిపారు. హుస్సేన్ సాగర్ ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తున్న ఇండ్లను హైడ్రా తొలగిస్తుందనే దుష్ప్రచారాన్ని నమ్మవద్దని తెలిపారు. హైడ్రా ఏర్పాటుకు ముందే ఉన్న నివాసాల విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కమిషనర్ స్పష్టంచేశారు. హుస్సేన్ సాగర్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న ఇండ్లకు హైడ్రా నోటీసులు ఇచ్చిందంటూ తప్పుడు ప్రచారం చేయడమే కాకుం డా.. అమాయకులను ముందుపెట్టి నెక్లెస్ రోడ్డులోని ఎంఎంటీఎస్ స్టేషన్ వద్ద ఆందోళన చేయించిన వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రాణాలైనా ఇస్తం.. ఇండ్లు వదులుకోం
రేవంత్‌రెడ్డిని అనవసరంగా గెలిపించినం. మాలాంటి పేదలకు ఏదో ఉద్ధరిస్తాడని అనుకున్నం. కానీ ఉన్న నీడ లేకుండా చేస్తున్నడు. మేము 40 ఏండ్లుగా ఇక్కడే నివాసం ఉంటున్నం. కూలీనాలి చేసుకొని బతుకుతున్నం. మాకు ఉన్న ఆధారం ఇండ్లు ఒక్కటే. కష్టపడి అప్పులు చేసి కట్టుకున్నం. హైడ్రా అధికారులు మా ఇండ్లు కూల్చివేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నరు. ఉన్నపళంగా ఇల్లు కూలగొడితే పిల్లలను తీసుకొని ఎక్కడికిపోవాలి. ప్రాణాలైనా ఇస్తాంగాని ఎట్టి పరిస్థితుల్లో ఇండ్లను వదులుకోబోం. – రామనర్సమ్మ, బీఎస్ మక్తా
బుల్డోజర్లు మాపై నుంచి పోనివ్వండి
40 ఏండ్లుగా మా కుటుంబం ఇక్కడే జీవిస్తున్నది. ఉన్నపళంగా ఇల్లు కూలగొడితే ఎక్కడికిపోవాలె. ఇక్కడ రేవంత్‌రెడ్డి చుట్టాలు ఏదో కడుతున్నారట! అందుకే హైడ్రాను అడ్డుపెట్టుకొని మమ్మల్ని వెళ్లగొట్టాలని చూస్తున్నరు. అధికారులను అడిగితే.. ఇది ప్రభుత్వ ఆదేశం, మా చేతుల్లో ఏమీ లేదు అంటున్నరు. ఒకవేళ మా ఇండ్లు కూల్చేందుకు బల్డోజర్లు వస్తే ముందుగా మాపై నుంచి పోనివ్వాలె. ఆ తర్వాతే ఇండ్లు కూల్చేసుకోవాలె.
– మల్లీశ్వరి, బీఎస్ మక్తా