హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉన్నత విద్యామండలి నిర్ణయాలకు వ్యతిరేకంగా 19, 20 తేదీల్లో సదస్సులు నిర్వహించాలని భాషా అధ్యాపకులు నిర్ణయించారు. మూడేండ్ల భాషా కోర్సును రెండేండ్లకు కుదించడంతోపాటు 20 క్రెడిట్లను 12 క్రెడిట్లకే పరిమితం చేస్తూ ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకున్నది. తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ వంటి భాషా అధ్యాపకులను, కళాశాలల ప్రిన్సిపాళ్లను, భాషా పీఠాధిపతులను సంప్రదించకుండా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఈ నిర్ణయం తీసుకున్నదని భాషా అధ్యాపకులు మండిపడుతున్నారు.
సిలబస్ ఖరారు చేసే విషయంలోనూ ఒంటెద్దు పోకడలకు పోతుందని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఆయా నిర్ణయాలకు వ్యతిరేకంగా సదస్సులు నిర్వహించాలని వారు నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా ఈ నెల 19న ఓయూ వేదికగా ఇంగ్లిష్ భాషపై, ఈ నెల 20న తెలుగు భాషపై అధ్యాపకుల సదస్సు నిర్వహించడం కోసం వారు షెడ్యూల్ విడుదల చేశారు. ఈ సదస్సుల్లో యూనివర్సిటీలతోపాటు అటానమస్, అనుబంధ ప్రైవేటు కాలేజీలకు చెందిన అధ్యాపకులందరూ హాజరు కానున్నట్టు సదస్సు నిర్వాహకులు ఆచార్య సాగి కమలాకర్ శర్మ తెలిపారు.