
నందికొండ/పెద్దఅడిశర్లపల్లి, డిసెంబర్ 27: నల్లగొండ జిల్లా నందికొండలోని బుద్ధవనం పరిసర కృష్ణానది తీరంలో ఆదిమానవుడి ఆనవాళ్లు బయల్పడ్డాయని పురావస్తు పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మ య్య ఆధ్వర్యంలో బుద్ధవనంలో నదీతీరం వరకు ఏర్పాటు చేసిన వాకింగ్ ట్రాక్‌ను పత్రికా సంపాదకుల బృందంతో కలిసి సోమవారం పరిశీలిస్తుండగా కొత్త రాతి యుగం నాటి ఆనవాళ్లను గుర్తించారు. ఈ సందర్భంగా శివనాగిరెడ్డి మాట్లాడుతూ.. బుద్ధవనం పరిసరాల్లో రాతి పనిముట్టు, అరగదీసిన గుంటలు కనిపించాయని తెలిపారు. అవి క్రీస్తు పూర్వం 4 వేల నుంచి 2 వేల ఏండ్ల మధ్య కాలానికి చెందినవని చెప్పారు. అలాగే పెద్దఅడిశర్లపల్లి మండలం పెద్దగట్టు పరిధి దేవరచర్ల గుహల్లో క్రీ.శ మూడో శతాబ్దం నాటి ఇక్ష్వాకుల బౌద్ధ శిలా మండప స్తంభం వెలుగు చూసిందని తెలిపారు. నాగార్జునకొండ ఏలేశ్వరం గుట్టలో జరిపిన తవ్వకాల ఆధారంగా దేవరచర్ల 1,700 ఏండ్ల క్రితం బౌద్ధ స్థావరమని పేర్కొన్నారు. ఆయనవెంట తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ఐజేయూ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, వెలుగు దినపత్రిక ఎడిటర్ చంద్రమౌళి, పయొనీర్ ప్రతినిధి మెల్లీమైత్రీయి తదితరులు ఉన్నారు.