God of War | యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో ‘గాడ్ ఆఫ్ వార్’ ఒకటి. స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించనున్న ఈ భారీ పాన్ ఇండియా చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన కాన్సెప్ట్ పోస్టర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచగా.. ఇప్పుడు హీరోయిన్‌కు సంబంధించిన వార్తలు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారాయి. సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ కియారా అద్వానీ పేరును పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఈ చిత్రం పురాణ గాథల స్ఫూర్తితో రూపొందనున్న మైథలాజికల్ యాక్షన్ డ్రామా అని వార్తలు వస్తుండగా.. ఎన్టీఆర్ ఇందులో శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నట్లు టాక్. కథలో కీలకమైన మహిళా పాత్రకు కియారా సరిపోతారని మేకర్స్ భావిస్తున్నట్లు సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఎన్టీఆర్, కియారా అద్వానీ ఇప్పటికే ‘వార్ 2’ చిత్రంలో కలిసి నటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమాలో వారి మధ్య పూర్తి స్థాయి జోడీ కనిపించలేదు. దీంతో ‘గాడ్ ఆఫ్ వార్’లో నిజంగానే కియారా హీరోయిన్గా ఎంపికైతే.. తొలిసారి ఎన్టీఆర్ సరసన పూర్తి స్థాయి కథానాయికగా కనిపించే అవకాశం ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు.
కియారా నటించిన ‘భరత్ అనే నేను’ ఘన విజయం సాధించగా, రామ్ చరణ్‌తో చేసిన ‘వినయ విధేయ రామ’, ‘గేమ్ ఛేంజర్’ ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయాయి. దీంతో కొందరు అభిమానులు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో సెంటిమెంట్‌గా చర్చిస్తున్నారు. అయితే ఇవి కేవలం అభిమానుల అభిప్రాయాలే తప్ప, సినిమా ఫలితాలతో నేరుగా సంబంధం ఉందని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవు. ముంబైకి చెందిన కియారా అద్వానీ.. బాలీవుడ్లో ఫగ్లీ తో కెరీర్ ప్రారంభించి, ‘ఎం.ఎస్. ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ’, ‘కబీర్ సింగ్’, ‘షేర్షా’ వంటి చిత్రాలతో స్టార్ హీరోయిన్గా ఎదిగారు. నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాను వివాహం చేసుకున్న తర్వాత కూడా వరుస ప్రాజెక్టులతో బిజీగా కొనసాగుతున్నారు. మరోవైపు ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘డ్రాగన్’ షూటింగ్లో పాల్గొంటున్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాతే త్రివిక్రమ్ దర్శకత్వంలోని ‘గాడ్ ఆఫ్ వార్’ సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని సమాచారం.