రామాయంపేట, ఏప్రిల్ 21 : తమ భూముల్లో నుంచి బైపాస్ రోడ్డు నిర్మాణం చేపడితే ఆత్మహత్యలు చేసుకుంటామని భూ నిర్వాసితులు హెచ్చరించారు. మెదక్-ఎల్కతుర్తి రోడ్డు సర్వే పనులను మెదక్ జిల్లా రామాయంపేటలో సోమవారం భూనిర్వాసితులు అడ్డుకొని అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఎట్టిపరిస్థితుల్లోనూ తమ భూములు ఇచ్చేది లేదంటూ భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో మెదక్ ఆర్డీవో రమాదేవి, ఎన్హెచ్ఏఐ డీఈ ఇన్నయ్య, రామాయంపేట తహసీల్దార్ రజినీకుమారి, సీఐ వెంకటరాజగౌడ్, ఎస్సై బాలరాజు అక్కడికి చేరుకుని భూనిర్వాసితులను సముదాయించేందుకు ప్రయత్నించారు.
రైతులకు తగిన పరిహారం చెల్లిస్తామని ఆర్డీవో రమాదేవి హామీ ఇచ్చినా వారు వినిపించుకోలేదు. తమకు నష్ట పరిహారం వద్దని, భూములు లాక్కోవద్దని నినాదాలు చేశారు. తమకు న్యాయం చేస్తానని, అండగా ఉంటానని బీజేపీ ఎంపీ రఘునందర్రావు నమ్మించి మోసం చేశారని భూనిర్వాసితులు ఆరోపించారు. ఎక్కడా లేని బైపాస్ నిర్మాణం రామాయంపేటలో ఎందుకు చేపడతున్నారని అధికారులను నిలదీశారు.