జయశంకర్ భూపాలపల్లి, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ) : సింగరేణిలో (Singareni) భూ నిర్వాసితులకు చుక్కెదురైంది. ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన ‘కొలువుల దందాలో కోటికి స్కెచ్’ అనే వసూళ్ల పర్వం కొనసాగుతూనే ఉంది. అక్రమ వసూళ్ల నేపథ్యంలో 7 నెలలుగా సింగరేణిలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుల నియామక ప్రక్రియ నిలిచిపోయింది. ‘నమస్తే’ ఎఫెక్టుతో ఇప్పుడు నేరుగా కాకుండా దేహదారుఢ్య, పరుగు పందెంలో నెగ్గిన వారినే తీసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏడు నెలలుగా నిలిచిన నియామక ప్రక్రియ ఎట్టకేలకు రన్నింగ్ రేస్‌తో ప్రారంభం కాబోతున్నది. అధికార పార్టీ నాయకులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు రికమండ్ చేసిన అభ్యర్థులు సింగరేణి నిర్వహించే ఫిజికల్ ఫిట్నెస్ పరీక్షల్లో నెగ్గుతారా..? పైరవీలతో పని కానిచ్చేస్తారా అనేది ఇప్పుడు హాట్ టాఫిక్‌గా మారింది. గతంలో సింగరేణిలో ప్రైవేట్ కాంట్రాక్టర్ వద్ద పనిచేసిన 11 మంది భూనిర్వాసితులను యాజమాన్యం తొలగించింది. కొత్త కాంట్రాక్టులో తీసుకుంటామని హామీ ఇచ్చి ఇప్పుడు పట్టించుకోవడం లేదని నిర్వాసితులు మండిపడుతున్నారు. నిర్వాసితులు హైకోర్టు మెట్లు ఎక్కగా తమకు అనుకూలంగా తీర్పు వచ్చినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని బాధితులు సింగరేణి కార్యాలయం ఎదుల ఆందోళనకు సిద్ధమవుతున్నారు.
భూపాలపల్లి ఏరియాలోని ఓసీ 3 సమీపంలోని బస్వరాజుపల్లి తదితర గ్రామాలకు చెందిన 11 మంది భూ నిర్వాసితులు 2023లో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులుగా సింగరేణిలో జాయిన్ అయ్యారు. ఆర్ఎంజీ అనే సెక్యూరిటీ సంస్థలో 4 నెలల పాటు విధులు నిర్వహించారు. ఆ సంస్థ కాలపరిమితి ముగియగా మరో సెక్యూరిటీ సంస్థ బాధ్యతలు తీసుకుని ఆర్ఎంజీ సంస్థకు సంబంధించిన సెక్యూరిటీ గార్డులను కొనసాగించింది. వారికి పీఎఫ్ సైతం అమలైంది. కొంతకాలానికి 11 మంది సెక్యూరిటీ గార్డులను తొలగించగా వారు ఆందోళన చేపట్టారు. దీంతో కొత్తగా వచ్చే మరో సెక్యూరిటీ సంస్థలో తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారని బాధితులు వాపోయారు. కొత్తగా వచ్చిన సెక్యూరిటీ సంస్థ సైతం తమను పట్టించుకోవడం లేదని, హైకోర్టుకు వెళ్లగా తమకు అనుకూలంగా తీర్పు వచ్చినా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. తమను విధుల్లోకి తీసుకునే వరకు ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఆర్ఎంజీ సెక్యూరిటీ సంస్థ నిర్వాహకుడు మహీధర్‌రెడ్డి మాట్లాడుతూ 11 మంది భూ నిర్వాసితులు తమ సంస్థలో ఆరు నెలలపాటు పనిచేశారని , వారికి పీఎఫ్ సైతం కట్ అయిందని చెప్పారు. వారిని ఎందుకు తీసేశారో తనకు తెలియదని చెప్పారు. ఈ విషయం తన దృష్టికి రాలేదని ఏరియా సింగరేణి ఎస్వోటు జీఎం కవీంద్ర పేర్కొన్నారు.
ఏడు నెలల క్రితం ఒక కాంట్రాక్టర్‌కు సెక్యూరిటీ టెండర్ దక్కగా ఆయన ఇంతవరకూ నియామక ప్రక్రియ ప్రారంభించలేదు. అధికారులు, ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ నేతల నుంచి తమ మనుషులను తీసుకోవాలనే డిమాండ్ మేరకే కాంట్రాక్టర్ నియామక ప్రక్రియ వాయిదా వేసినట్టు తెలుస్తున్నది. మొత్తం 27 మందిని నియమించాల్సి ఉండగా ఇప్పటివరకు ఆ ఊసే లేదు. 27 మందికి 40 మందిని తీసుకునేందుకు కాంట్రాక్టర్ రంగం సిద్ధం చేసుకుని ఒకొక్కరి వద్ద రూ.3 లక్షలు తీసుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. దీంతో రిక్రూట్మెంట్ వాయిదా పడింది.