Hanumkonda | భీమదేవరపల్లి, నవంబర్ 4: తండ్రి నుంచి ఆస్తి పొందిన కొడుకు ఆ తరువాత సరిగ్గా చూడకపోవడంతో సదరు తండ్రి తన ఆస్తిని తిరిగి సొంతం చేసుకున్నారు. సీనియర్ సిటిజన్ యాక్టు ద్వారా సదరు ఆస్తిని తిరిగి పొందారు. ఈ ఘటన హనుమకొండ జిల్లాలో చోటుచేసుకున్నది. భీమదేవరపల్లి మండలం ముస్తఫాపూర్కు చెందిన మద్దెల రాజకొమురయ్య, మల్లమ్మ దంపతులకు కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వీరందరికీ పెళ్లిళ్లు జరగ్గా.. ఆరేళ్ల క్రితం మల్లమ్మ మృతి చెందింది. తండ్రి 4.12 ఎకరాల వ్యవసాయ భూమిని కుమారుడు రవికి గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేశాడు. రవి అప్పటి నుంచి తండ్రిని పట్టించుకోవడం మానేశాడు. దీంతో రాజకొమురయ్య పెద్దమనుషులను ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయింది. పైగా తండ్రిపై చేయిచేసుకోవడంతో మానసికంగా కుంగిపోయాడు.
తన కుమారుడికి ఇచ్చిన భూమి పట్టాను రద్దు చేయాలని హనుమకొండ ఆర్డీవో, ముల్కనూరు పోలీసులకు అర్జీ పెట్టుకున్నాడు. అనంతరం తనువు చాలిద్దామని సిద్ధమై హసన్‌పర్తి మండలంలోని ఒక గ్రామానికి చెందిన గుట్టల్లో ఆత్మహత్య చేసుకునేందుకు వెళ్లిపోయాడు. అక్కడ గొర్ల కాపరులకు రాజకొమురయ్య కనిపించడంతో అతన్ని చేరదీసి నెలరోజులపాటు వారే సాకారు. అనంతరం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం పెద్ద పాపయ్యపల్లిలోని ఓ రైస్‌మిల్లులో వాచ్‌మెన్‌గా చేరాడు. విషయం తెలుసుకున్న హనుమకొండ ఆర్డీవో, భీమదేవరపల్లి తహసీల్దార్ విచారణ చేపట్టి రాజకొమురయ్య కొడుకుకు ఇచ్చిన పట్టాను రద్దు చేశారు. తిరిగి తండ్రికే పట్టా అందజేశారు. రాజకొమురయ్య ఇంటికి వెళ్తే కొడుకు దాడి చేయవచ్చనే అనుమానంతో అతనికి రక్షణ కల్పించాల్సిందిగా ముల్కనూరు ఎస్సై సాయిబాబును ఆదేశించినట్టు తహసీల్దార్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు.