హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ప్రజలు తమ అవసరాల కోసం ఓపెన్ ప్లాట్లను అమ్ముకోలేక, ఇండ్లు నిర్మించుకునేందుకు అనుమతులు రాక నానా తిప్పలు పడుతున్నారు. ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ శాఖల మధ్య సమన్వయ లోపంతో భూముల క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్) అమలు నిలిచిపోవడమే ఇందుకు కారణమని తెలుస్తున్నది. ఫీజు కట్టేందుకు దరఖాస్తుదారులు సిద్ధంగా ఉన్నప్పటికీ రెగ్యులరైజేషన్కు ప్రభుత్వం ససేమిరా అంటున్నది. దీంతో 25.67 లక్షల దరఖాస్తులకు ప్రొసీడింగ్స్ రాక ఇండ్లు నిర్మించుకోలేని పరిస్థితి నెలకొంది. ఎఫ్టీఎల్, నిషేధిత భూముల జాబితాలపై క్లియరెన్స్ ఇవ్వాల్సిన ఇరిగేషన్, రెవెన్యూ శాఖలు పరస్పరం నెపం వేసుకుంటూ తీవ్ర తాత్సారం చేస్తున్నాయి. దీంతో ప్రజలకు సమస్యలు తీరకపోవడంతోపాటు ప్రభుత్వానికి రాబడి రావడం లేదు. అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్ ద్వారా ఉచితంగా భూములను క్రమబద్ధీకరణ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం తన శాఖల సమన్వయ లోపం, వెబ్సైట్ సమస్యలతో ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్నది.
ఈ స్కీమ్ కింద 25% రిబేటును అమలు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. రెండో విడతలో దరఖాస్తులు ఆహ్వానించడంతో 25.67 లక్షల దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుదారుల్లో 5.19 లక్షల మంది నుంచి రెగ్యులరైజేషన్ ఫీజు కింద ప్రభుత్వం రూ.1,750 కోట్లు వసూలు చేసింది. కానీ, వారిలో కనీసం 20% మందికి కూడా రెగ్యులరైజేషన్ సర్టిఫికెట్లు జారీ చేయలేదు. ఇరిగేషన్, రెవెన్యూ శాఖల కొర్రీల వల్లనే సంబంధిత దస్ర్తాలు ఆగిపోయినట్టు చెప్తున్నారు. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ పునర్విభజన, ట్రై కమిషనరేట్ల ఏర్పాటుతో దరఖాస్తులకు అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో ఎల్ఆర్ఎస్ వెబ్సైట్ పూర్తిగా పడకేసింది. ప్రస్తుతం అత్యధిక దరఖాస్తులు ఎల్1 దశలోనే పెండింగ్లో ఉండటంతో దరఖాస్తుదారులు కార్యాలయాల చుట్టూ తిరగక తప్పడం లేదు. ఎల్1 దశలో తొలుత రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి ఆ దరఖాస్తులు ఎల్ఆర్ఎస్కు అర్హమైనవో కావో తేల్చాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఫైల్ హెచ్ఎండీఏకు చేరుతుంది. ఎల్1 దశ దాటితేనే మిగిలిన దశల్లో దరఖాస్తుల పరిష్కారానికి వీలుంటుంది.