వర్గల్, మే 2: వర్గల్ తహసీల్దార్ కార్యాలయంలో మనిషి లేకుండానే వేరొకరి పేరు మీద భూ బదలాయింపు జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సిద్దిపేట రూరల్ మండలం రాఘవపూర్కు చెందిన గ్యార మల్లేశంకు వర్గల్ మండలం గౌరారంలో ఎకరం భూమి ఉన్నది. మల్లేశం కొంతకాలం గా బోన్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు. రెండేండ్లుగా చికిత్సకోసం పెద్దమొత్తంలో ఖర్చుచేశాడు. దీంతో గౌరారంలో ఉన్న భూమిని అమ్ముదామని కుటుంబసభ్యులు నిశ్చయించి, మార్చిలో వర్గల్ తహసీల్ కార్యాలయంలో సంప్రదించగా, అప్పటికే మల్లేశం పేరుమీద ఉన్న భూమి వేరొకరి పేరుపై రిజిస్ట్రేషన్ అయిందని చెప్పడంతో అవాక్కయ్యారు. తమకు తెలియకుండా తమ భూమి ఇతరుల పేరుమీద ఎలా బదలయింపు జరిగిందని అధికారులను నిలదీయగా.. మార్చి నెల 4న అభిలాష్ పేరిట రిజిస్ట్రేషన్ కాగా, అదే నెలలో 10వ తేదీన రేణుక పేరుమీద రిజిస్ట్రేషన్ అయినట్టు వెల్లడించారు. మల్లేశం ఆఫీసుకు రాలేదు, ఫొటో దిగలేదు, ఐరిష్, వేలిముద్రలు పెట్టలేదు, కానీ.. భూమి ఇతరుల పేరు మీద రిజిస్ట్రేషన్ కావడంతో బాధితులు సిద్దిపేట కలెక్టర్, పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ప్రాణంపోతుంది …న్యాయం చేయండి సారూ…
మూడేండ్ల కిందట గౌరారంలో ఓ రైతు దగ్గర రూ.27 లక్షలు అప్పుచేసి భూమి కొ న్నా. విధి వక్రీకరించి అనారోగ్యంపాల య్యా. నాప్రాణం కాపాడుకోవడం కోసం ఇప్పటివరకు రూ.40 లక్షలు ఖర్చు దాటిం ది. అప్పులు మించిపోయాయి. ప్రాణం దగ్గరపడుతున్నది. నాభూమి నాకు వచ్చే లా చూడండి సారూ. -గ్యార మల్లేశం