Bhu Bharathi | హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రెవెన్యూ చట్టం ‘భూ భారతి’తో రెవెన్యూ రికార్డుల నిర్వహణలో అనేక మార్పులు జరగనున్నాయి. రాష్ట్రంలోని ప్రతి భూ కమతానికి ఆధార్ తరహాలో ‘భూదార్’ నంబర్‌ను కేటాయించనున్నారు. ఇకపై భూ క్రయవిక్రయాలు జరిపే సమయంలో ముందుగా ఆ భూమిని సర్వే చేయించాల్సి ఉంటుంది. ఆ తర్వాతే రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ధరణి పోర్టల్‌లో అందుబాటులో ఉన్న ‘ఇన్స్టెంట్ మ్యుటేషన్’ను కొ త్త చట్టంలోనూ కొనసాగించారు. క్రయవిక్రయాల సమయంలో రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక మ్యుటేషన్ కూడా పూర్తవుతుంది. కానీ, వారసత్వంగా జరిగే భూముల బదిలీ (ఫౌతీ)లో కొత్త నిబంధన తీసుకొచ్చారు. తాసిల్దార్ ఆఫీస్‌లో రిజిస్ట్రేషన్ జరిగినా.. మ్యుటేషన్ చేసే అధికారాన్ని మాత్రం ఆర్డీవోకు అప్పగించారు. నిర్ణీత కాలంపాటు (30 రోజులు) మ్యుటేషన్ చేయకుండా నిలిపివేస్తారు. ఆలోగా ఆ భూమి పై ఎలాంటి ఫిర్యాదులు రాకపోతే ప్రక్రియ పూర్తి చేస్తారు.
కోర్టు ద్వారా వచ్చే, ఓఆర్సీ, 38-ఈ తదితర మొత్తం 14 రకాల భూమి హకులపై మ్యుటేషన్ అధికారాలను ఆర్డీవోకు కట్టబెట్టారు. ఇప్పటివరకు ధరణి పోర్టల్‌లో మొత్తం 33 మాడ్యూళ్లు ఉండగా.. భూభారతిలో వాటిని 6కు తగ్గించనున్నారు. భూమి పట్టాలో కేవలం రైతు పేరు మాత్రమే ఉండగా.. ఇకపై అనుభవదారు కాలమ్ సహా మొత్తం 11 కాలమ్‌లు ఉంటాయి. పార్ట్-బీ కేసులు పరిష్కారమైనవారి వివరాలను భూ రికార్డుల్లో ఎక్కించి, పాస్ బుక్ ఇచ్చేలా మార్పులు చేశారు. తాసిల్దార్, ఆర్డీవో, అదనపు కలెక్టర్లకు అధికారం ఇచ్చారు. సాదాబైనామాల క్రమబద్ధీకరణ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. గ్రామ కంఠం, ఆబాదీలకు హకుల రికార్డును రూపొందిస్తుంది. 2014 వరకు సబ్ రిజిస్ట్రార్ల వద్ద రికార్డుల్లో ఉన్న ‘ప్రభుత్వ భూముల’ వివరాలను ప్రస్తుతం ధరణిలో ఉన్న డాటాతో సరిపోల్చనున్నట్టు ప్రభుత్వం చెప్తున్నది. ఆయా సర్వే నంబర్లలోని భూములన్నింటినీ ప్రభుత్వ భూములుగా పరిగణించి నిషేధిత జాబితాలో చేర్చుతామని తెలిపింది. దీంతో 2014కు ముందు పొరపాటున ప్రభుత్వ భూమిగా నమోదై.. 2014 తర్వాత వివాదం ముగిసి, పట్టాభూమిగా మారిన భూములన్నీ ఇప్పుడు మళ్లీ నిషేధిత జాబితాలోకి చేరనున్నాయి. కొత్త రెవెన్యూ చట్టానికి సంబంధించిన నియమ నిబంధనలను 3 నెలల్లో తీసుకురానున్నారు.
కొత్త రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తున్నామని డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ తెలిపింది. ఆ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు వీ లచ్చిరెడ్డి, కే రామకృష్ణ బుధవారం అసెంబ్లీలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని కలిసి అభినందనలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ.. భూ భారతి చట్టంతో రైతులకు ప్రయోజనం చేకూరుతుందని, రైతుల భూములతోపాటు ప్రభుత్వ భూములకు భద్రత చేకూరుతుందని, సాదాబైనామా దరఖాస్తులు పరిష్కారమవుతాయని అన్నారు. గ్రామ కంఠం, ఆబాదీలకు రికార్డులు వస్తాయన్నారు. కొత్త రెవెన్యూ చట్టాన్ని తెచ్చిన సీఎం రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ తాసిల్దార్స్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎస్ రాములు, రమేశ్ పాల్గొన్నారు.
నూతన ఆర్వోఆర్ చట్టాన్ని స్వాగతిస్తున్నామని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) తెలిపింది. ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంగా ట్రెసా అధ్యక్ష, కార్యదర్శులు వంగా రవీందర్‌రెడ్డి, గౌతమ్ కుమార్ బుధవారం అసెంబ్లీలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిసి అభినందనలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కొత్త రెవెన్యూ చట్టం త్వరగా అమల్లోకి రావాలని ఆకాంక్షించారు. దీని వల్ల పట్టాదారుల సమస్యలు కింది స్థాయిలోనే పరిష్కారమవుతాయని, అప్పీల్ వ్యవస్థ కారణంగా కోర్టులపై కూడా భారం తగ్గుతుందని తెలిపారు. కార్యక్రమంలో ట్రెసా నాయకులు రాజ్‌కుమార్, నిరంజన్, రమణ్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, తారక్ పాల్గొన్నారు.