హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ): వికారాబాద్ జిల్లా దామగుండం ఈఎల్ఎఫ్ రాడార్ కేంద్రానికి 2,900 ఎకరాల అటవీ భూములను ఇవ్వడంపై అదనపు వివరాలు సమర్పించాలని, బయోడైవర్సిటీ చట్టం కింద ఏర్పాటైన కమిటీ ఉన్నదో లేదో చెప్పాలని హైకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. రాడార్ ప్రాజెక్టుకు ప్రభుత్వం అటవీ భూమిని కేటాయించినందున అదనపు అటవీ ప్రాంత అభివృద్ధితోపాటు పర్యావరణ సమతుల్యతను, జీవవైవిధ్యాన్ని పరిరక్షించేందుకు చేపట్టే చర్యలేమిటో నివేదించాలని స్పష్టం చేసింది.
రాడార్ ప్రాజెక్టు కోసం రిజర్వు అటవీ ప్రాంతాన్ని బదలాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా 2020లో దామగుండం ఫారెస్ట్ ప్రొటెక్షన్ జేఏసీ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. తొలుత కోర్టుకు సహాయకారి (అమికస్ క్యూరీ)గా నియమితులైన న్యాయవాది స్పందిస్తూ.. రాడార్ తరంగాల వల్ల పక్షులు, వన్యప్రాణులపై పడే ప్రభావం ఏమేరకు ఉంటుందో స్పష్టత లేదని చెప్పారు. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు కౌంటర్ వేయలేదని, కేంద్ర ప్రభుత్వం కౌంటర్ వేసినప్పటికీ అందులో కీలక విషయాలు లేవని తెలిపారు.
బయోడైవర్సిటీ చట్టం కింద ఏర్పాటైన కమిటీ ఉన్నదో లేదో స్పష్టత ఇవ్వలేదని పేర్కొన్నారు. అనంతరం ఇంప్లీడ్ పిటిషనర్ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. అటవీ భూమి ధ్వంసంపైనే తాము ఆందోళన చెందుతున్నామని, అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నదే తమ అభిమతమని చెప్పారు. రాడార్ ప్రాజెక్టు కేంద్రం ఏర్పాటుపై ఉన్న స్టే ఆర్డర్‌ను 2021లో హైకోర్టు ఎత్తివేసినప్పటికీ తమ తీర్పునకు లోబడి ఆ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అప్పట్లో షరతు విధించింది. తాజాగా ఈ ఉత్తర్వులను పొడిగించిన హైకోర్టు.. తదుపరి విచారణను నవంబర్ 13కు వాయిదా వేసింది.