Industrial Park | హైదరాబాద్, మార్చి 12(నమస్తే తెలంగాణ) : అధికారంలోకి వచ్చినప్పటినుంచి పేదల భూములపై పడిన కాంగ్రెస్ సర్కారు హైదరాబాద్ పరిసరాల్లో ఖరీదైన భూములు ఎక్కడున్నా వాటిని వదిలిపెట్టడంలేదు. భూములు ఇచ్చేదిలేదని రైతులు నెత్తీనోరూ బాదుకుంటున్నా ఇండస్ట్రియల్ పార్క్‌ల పేరుతో ప్రభుత్వం ఏకపక్షంగా నోటిఫికేషన్లు జారీ చేస్తూనే ఉన్నది. అభ్యంతరాలున్నవారు కలెక్టర్ కార్యాలయంలో చెప్పుకోవాలని హుకుం జారీచేస్తున్నది. తాజాగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కొంగరఖుర్దు గ్రామ పరిధిలో 277.06ఎకరాల అసైన్డ్ భూముల సేకరణకు బుధవారం నోటిఫికేషన్ జారీచేసింది. గ్రామం వద్ద ఇండస్ట్రియల్ పార్క్, లేక ఐటీ పార్కు ఏర్పాటుకు భూమి సేకరించాలని నిర్ణయించినట్టు కలెక్టర్ నోటిఫికేషన్ జారీచేశారు. 153మంది రైతుల నుంచి ఈ భూములు సేకరించనున్నారు. అన్నీ లావుని పట్టా భూములు కావడం విశేషం. ఈ భూముల అమ్మకం, కొనుగోలు, లీజుకి ఇవ్వడం వంటి లావాదేవీలు నిర్వహించరాదని పేర్కొన్నారు. అభ్యంతరాలు ఉన్నవారు 60రోజుల్లోగా కలెక్టర్, లేక అధీకృత అధికారి సమక్షంలో అభ్యంతరాలు నమోదు చేయవచ్చని సూచించారు.
పారిశ్రామికవాడల ఏర్పాటు కోసం ఇప్పటికే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని లగచర్ల, దిలావర్పూర్, తిమ్మాపూర్, నాగిరెడ్డిపల్లి తదితర ప్రాంతాల్లో భూసేకరణ నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. ఇందులో అధికంగా అసైన్డ్ భూములు, కొన్నిచోట్ల సీలింగ్ భూములు ఉన్నాయి. భూములన్నీ దళితులు, గిరిజనుల సాగులో ఉన్న పంట భూములే కావడం విశేషం. అరకొర నష్ట పరిహారం అందిస్తూ భూములను బలవంతంగా సేకరిస్తున్నట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వ్యతిరేకిస్తున్న రైతులను నిర్బంధించడం, పోలీసుల సహాయంతో భూములను స్వాధీనం చేసుకోవడం వంటి చర్యలకు దిగడంపై రైతులు మండిపడుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల పరిధిలో భూముల ధరలు రూ. కోట్లల్లో ఉండటంతో రైతులనుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ప్రభుత్వం ఎకరాకు రూ. 20లక్షలకన్నా ఎక్కువ నష్ట పరిహారం ఇవ్వడంలేదని, ఆ డబ్బుతో తాము రాష్ట్రంలో మరెక్కడా భూములు కొనుక్కునే పరిస్థితి లేదని బాధితులు వాపోతున్నారు. ప్రభుత్వం అంతగా ఇండస్ట్రియల్ పార్క్‌లు ఏర్పాటు చేయాలనుకుంటే బహిరంగ మార్కెట్ ధర చెల్లించి భూములు తీసుకోవాలని, లేకుంటే తమకు భూమికి బదులు భూమి ఇవ్వాలని వారు కోరుతున్నారు.