కవాడిగూడ, సెప్టెంబర్ 19: రాజకీయ ప్రయోజనాల కోసం లంబాడీ తెగల మధ్య చిచ్చు పెట్టేందుకు కొంతమంది నాయకులు, కార్పొరేట్ శక్తులు కలిసి చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని తెలంగాణ లంబాడీ ఆత్మగౌరవ వేదిక పిలుపునిచ్చింది. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించేందుకు కొందరు కుట్రలు చేస్తున్నారని పలువురు వక్తలు ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ లంబాడీ ఆత్మగౌరవ వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం ఇందిరాపార్కు వద్ద లంబాడీల ఆత్మగౌరవ సభ నిర్వహించారు. ఈ సభలో మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, రెడ్యానాయక్, అమర్‌సింగ్, మాజీ ఎంపీలు సీతారాంనాయక్, మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్, తెగ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రనాయక్, కరాటే రాజునాయక్, నెహ్రూనాయక్, సంపత్‌నాయక్, శరత్‌నాయక్, రవీందర్‌నాయక్, భీంరావ్నాయక్ తదితరులు పాల్గొని మాట్లాడారు. దేశానికి స్వాతంత్య్రం రాకముందే లంబాడీ బంజారా ప్రజలను గిరిజన తెగలుగా గుర్తించారని, నిజాం కాలంలో చేసిన జనగణనతో లంబాడీలను గిరిజనులుగా గుర్తించారని వక్తలు వివరించారు.
చరిత్ర తెలియకుండా కొంతమంది చేస్తున్న దుష్ర్పచారాన్ని మానుకోవాలని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో తెలంగాణలోని ప్రతి తండాలోని లంబాడీ ప్రజలను చైతన్యం చేసేందుకు బస్సుయాత్ర చేపడతామని, లంబాడీ గిరిజన హక్కుల సాధన కోసం హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని ప్రకటించారు. రాష్ట్ర క్యాబినెట్లో లంబాడీ ప్రజాప్రతినిధులకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. లంబాడీ, ఇతర తెలగలకు మధ్య జరుగుతున్న వివాదాన్ని నివారించేందుకు ప్రభుత్వం పెద్దన్న పాత్ర వహించి ఇరుపక్షాలను కూర్చోబెట్టి మాట్లాడాలని కోరారు. రైతాంగ సాయుధ పోరాటంలో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన జాటోత్ టానునాయక్ విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటుచేయాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో మాజీ ట్రైకార్ చైర్మన్ రామచంద్రునాయక్, మాజీ జీసీసీ చైర్మన్ వాల్యానాయక్, ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాల్‌నాయక్, హరికిషన్‌నాయక్, ఎల్జేఏసీ కన్వీనర్ జైసింగ్‌రాథోడ్, టీచర్స్ యూనియన్ నాయకులు లక్ష్మణ్‌నాయక్, నాయకులు విజేందర్నాయక్, సురేశ్‌నాయక్, మహేశ్‌నాయక్, రమేశ్రాథోడ్తోపాటు ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.