హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర బడ్జెట్లో గిరిజనులకు కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర అన్యా యం చేసిందని లంబాడీ హకుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ముడావాత్ రాంబల్‌నాయక్ మండిపడ్డారు. దీన్ని నిరసిస్తూ బుధవారం ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఆరు గ్యారెంటీలంటూ ఊదరగొడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనుల ప్రాథమిక హకులను కాలరాస్తున్నదని ధ్వజమెత్తారు.
మంత్రివర్గంలో లంబాడీలకు చోటు కల్పించకుండా గిరిజన సమాజాన్ని అవమానించిందని, చేవెళ్ల డిక్లరేషన్‌లో ఇచ్చిన 15 హామీలను అటకెక్కించిందని నిప్పులు చెరిగారు. గిరిజనుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా బడ్జెట్‌ను రూపొందించిందని, నిధులివ్వకుండా నీతులు వల్లిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఎల్‌హెచ్‌పీఎస్, సేవాలాల్ సేన, బంజారా సేవా సంఘం సంయుక్తంగా నిర్వహించనున్న ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమానికి గిరిజన సంఘాల నేతలు, విద్యార్థులు భారీగా తరలిరావాలని ఆ ప్రకటనలో పిలుపునిచ్చారు.