ఇంద్రవెల్లి, సెప్టెంబర్ 24 : లంబాడాలు, సుగాలి, బంజారాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని, లేనిపక్షంలో స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరిస్తామని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు కోట్నాక్ విజయ్‌కుమార్, ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షుడు మైపతి అరుణ్‌కుమార్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడం గణేశ్ హెచ్చరించారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలో అమరవీరులకు నివాళులర్పించారు. అక్కడి నుంచి భారీ ర్యాలీగా బయలుదేరి మార్కెట్ యార్డులో తుడుందెబ్బ, గోండ్వానా పంచాయతీ రాయిసెంటర్, రాజ్‌గోండ్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో వారు మాట్లాడారు. చట్టబద్ధతలేని లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని, సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చిన నోటీసుపై పూర్తి వివరణ ఇవ్వాలని కోరారు. వలస వచ్చి అక్రమంగా ఎస్టీ జాబితాలో చేరిన లంబాడాలకు ఎస్టీ కుల ధ్రువీకరణ, ఏజెన్సీ సర్టిఫికెట్లు జారీ చేయవద్దని, సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించవద్దని డిమాండ్ చేశారు. అన్ని రాజకీయ పార్టీలు ఒకే వేదికపైకి వచ్చి ఐక్య పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.