ములుగు : మేడారంలోని(Medaram) స్వాగత ద్వారాలు, గద్దెల చుట్టూ ఏర్పాటు చేసిన స్తంభాల పై ఉన్న చిత్రాలను పునఃపరిశీలన చేయాలని తుడుం దెబ్బ జాతీయ కన్వీనర్జాతీయ కన్వీనర్ రమణాల లక్ష్మయ్య అన్నారు. మేడారం జాతర పనులను పరిశీలించి ఆయన మాట్లాడారు. ఆదివాసీలు ప్రకృతి ఆరాధకులుగా ఉంటూ ప్రత్యేకమైన జీవన విధానం, సంస్కృతి, సంప్రదాయాలను పాటిస్తారు. అటువంటి విధానం కలిగిన ఆదివాసీలకు హిందూత్వ మూలాలు అంటగట్టే ప్రయత్నం చేయడం సరియైన పద్ధతి కాదన్నారు.
ప్రధాన ముఖ ద్వారం మీద ఉన్న ఉన్నా స్వస్తిక్ గుర్తు, పగిడిద్దరాజు గద్దెల వద్ద ఉన్న రాతి చిత్రాల పై ఉన్న శంఖు, చక్రాలు, తిరునామాలు ఆదివాసి సంస్కృతి లోలేవన్నారు. వీటిని పెట్టడం ద్వారా ఆదివాసి చరిత్రను రాబోయే తరానికి తప్పుగా తెలియజేసినట్లు అవుతుందన్నారు. ప్రభుత్వం దీని పై స్పందించి ఈ చిత్రాల పై పునఃపరిశీలన చేసి ఆదివాసి సంస్కృతి సంప్రదాయాల ను పరిరక్షించాలని కోరారు. అట్లాగే కోయ తెగ సాంస్కృతిక సాంప్రదాయాల్లో పెద్దమనుషులు, పడిగెలు కుట్టే కళాకారులు, కోయ పురాణం చెప్పే కోయ కళాకారుల ప్రాతినిధ్యం ఉంటుంది. కావున వారి అభిప్రాయ సేకరణ లేకుండా ఈ నిర్మాణంలో వారిని భాగస్వామ్యం చేసుకోకపోవడం వల్ల సమస్యలు ఉత్పన్నం అవుతాయన్నారు.
వెంటనే ఈ సాంస్కృతిక వ్యవస్థలో ఈ కళాకారులను అందర్నీ కలుపుకొని పునఃపరిశీలన చేయాలని మేం డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి పొలిటికల్ జేఏసీ చైర్మన్ వాసం రామకృష్ణ, గొండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు పాయం సత్యనారాయణ, తుడుం దెబ్బ జాతీయ కో కన్వీనర్ పొడేం రత్నం, యాసం రాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కబ్బాక శ్రావణ్ కుమార్, రాష్ట్ర కార్యదర్శులు వట్టం కన్నయ్య, పూనెం శ్రీను, పాయం జానకి రమణ, మడకం చిట్టిబాబు, వట్టం జనార్ధన్, ములుగు జిల్లా అధ్యక్షకార్యదర్శులు చందా మహేష్, కాపుల సమ్మయ్య,మహబూబాబాద్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సువర్ణపాక వేంకట రత్నం, చీమల శివకుమార్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దుగ్గరపు వీరభద్రం, చింత వేంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.