‘నలుదిక్కులా నేనెంత దూరమైతే చూడగలుగుతున్నానో.. అంతదూరం నాకు కేవలం మనుషుల తలలు తప్ప మరేమీ కనిపించలేదు. ఇంత భారీ జనసందోహాన్ని నేనింత వరకూ చూడలేదు. ఇంతమందిని కలుసుకొనే భాగ్యాన్ని కల్పించిన ఈ నేలకు.. ఆ మహానేత కేసీఆర్‌కు వందనం.. ఇదీ ఖమ్మం బీఆర్ఎస్ జనజాతరను చూసి పంజాబ్ సీఎం భగవంత్‌మాన్ తన్మయత్వానికి లోనైన అపురూప సందర్భం.
హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ తొట్టతొలి బహిరంగ సభతో గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ మరో చరిత్ర సృష్టించారు. దేశంలో భారీ సభల నిర్వహణలో బీఆర్ఎస్కు సాటి, పోటీ మరెవ్వరూ ఉండరని నిరూపించారు. జన ప్రభంజనంతో ఖమ్మం నగరం హోరెత్తింది. జై భారత్.. జై కేసీఆర్ నినాదాలతో ఉర్రూతలూగింది. దేశగతిని కచ్చితంగా మారుస్తుందన్న విశ్వాసాన్ని సభ కల్పించింది. లక్షలాదిగా తరలివచ్చిన జనంతో ఖమ్మం గులాబీమయమైంది. సీఎం కేసీఆర్ ఏం చెప్తారోనన్న ఆసక్తితో ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ర్టాల నుంచి కూడా ప్రజలు తరలివచ్చారు. భారీ జన సందోహంతో బహిరంగ సభా ప్రాంగణమంతా పండుగ వాతావరణాన్ని సంతరించుకొన్నది.
బీజేపీని ఎదుర్కొనే సత్తా బీఆర్ఎస్కే
దేశంలో బీజేపీని ఎదుర్కొనే సత్తా బీఆర్ఎస్ నేతృత్వంలోని విపక్షాలకు ఉన్నదని ఖమ్మం బహిరంగసభ నిరూపించింది. దేశగతిని మార్చి భారతావని నుదుట ప్రగతి తిలకం దిద్దుతుందని సాక్షాత్కారించింది. సీఎంలు కేజ్రీవాల్, భగవంత్‌మాన్, పినరాయి విజయన్, మాజీ సీఎం అఖిలేశ్‌యాదవ్, సీపీఐ నేత డీ రాజాను సీఎం కేసీఆర్ తన వెంట వేదిక మీదకు తోడ్కొని రాగానే సభాప్రాంగణంలోని జనం అంతా కృతజ్ఞతాపూర్వకంగా లేచి నిల్చొని అపూర్వ స్వాగతం పలికారు. మధ్యాహ్నం 3.30 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకొన్న అతిరథ మహారథులు జన సందోహానికి నమస్కరించి 3.35 నిమిషాలకు అందరూ చేతులు కలిపి బహిరంగసభకు ఐక్యత సంకేతాన్ని ఇస్తూ అభివాదం చేశారు. ‘నరేంద్రమోదీ 2024 తర్వాత నువ్వు ఇంటికి.. మేం ఢిల్లీకి’ అని సీఎం కేసీఆర్ గర్జించినప్పుడు సభాప్రాంగణం అంతా చప్పట్లు.. ఈలలు.. కేరింతలతో దద్దరిల్లింది. దేశంలో బీజేపీని ఎదుర్కొనే శక్తి తమకే ఉందని సీఎం కేసీఆర్ ఘంటాపథంగా ప్రకటించిన సమయంలో అపూర్వంగా స్పందించారు.
అసాధారణ ఏర్పాట్లు
బహిరంగ సభ నిర్వహణకు బీఆర్ఎస్ అసాధారణ ఏర్పాట్లు చేసింది. సభావేదిక మీదున్న నాయకులు, అధినాయకుల ప్రసంగాలు చేస్తున్నప్పుడు ఏ చోట ఉన్నా అందరికీ కనిపించేలా జపాన్ సాంకేతికతతో వేదికను రూపొందించా రు. మహిళలు, పురుషులకు వేర్వేరుగా100 మొబైల్ టాయిలెట్లు ఏర్పాటుచేశారు.
అబ్బురపడిన సీఎంలు
లక్షలాదిగా తరలివచ్చిన ప్రజలను చూసి ప్రత్యేక అతిథులు, ముగ్గురు సీఎంలు అబ్బురపడ్డారు. అశేష జనవాహినిని చూసి తరించిపోయారు. దేశంలో కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో తమను భాగస్వామ్యం చేయటం జీవితంలో మరిచిపోలేని అనుభూతిని కల్పిస్తున్నదని, తెలంగాణ గడ్డను, సీఎం కేసీఆర్ వంటి మహానేత ఆతిథ్యాన్ని ఎన్నటికీ మరచిపోబోమని కృతజ్ఞతలు తెలిపారు.