Lagcherla | తమ భూములను వదిలేయాలని సీఎం రేవంత్ రెడ్డిని లగచర్ల ఫార్మా కంపెనీ బాధితులు విజ్ఞప్తి చేశారు. ఉన్న భూమి మొత్తం తీసుకుంటా అంటే ఎలా బతకాలని ప్రశ్నించారు. ఇంట్లో ఉండాలంటేనే భయం వేస్తోందని.. పోలీసులు ఎప్పుడు వచ్చి ఏం చేస్తారోనని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. లగచర్లలో అర్ధరాత్రి సమయంలో పోలీసులు సృష్టించిన అరాచకంపై బాధితులు ఢిల్లీలోని జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
మా భూములు ఇచ్చేది లేదంటూ గత 9 నెలలుగా చాలా ధర్నాలు చేస్తున్నామి లగచర్ల బాధితులు తెలిపారు. మేము ధర్నాలు చేసినప్పుడు సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి, కలెక్టర్ సహా ఏ అధికారి రాలేదు.. కానీ మొన్న మాత్రం కలెక్టర్ సాధారణ దుస్తుల్లో పోలీసు సెక్యురిటీ లేకుండా వచ్చారని పేర్కొన్నారు. దీంతో కొంతమంది పిల్లలు తెలియకుండా దాడి చేశారని చెప్పారు. ఆ దాడిని సాకుగా చూపి అర్ధరాత్రి500 మంది పోలీసులు వచ్చి, కరెంట్ బంద్ చేసి తమపై దౌర్జన్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కుతిక పిసికి, కళ్లకు బట్టలు కట్టి, ఇష్టానుసారం బూతులు తిడుతూ కొట్టారని కన్నీళ్లు పెట్టుకున్నారు. మగవాళ్లందరనీ అరెస్ట్ చేశారని.. మిగిలిన మగవాళ్లు ఊరు వదిలి పారిపోయారని తెలిపారు.
మా భూములు ఎట్టిపరిస్థితుల్లో ఇవ్వమని లగచర్ల బాధితులు స్పష్టం చేశారు. తమ భూములను వదిలేయాలని.. తమ వారిని వదిలేయాలని కోరారు. తమకు ఉన్న మొత్తం భూమిని తీసుకుంటా అంటే ఎలా బతకాలని ప్రశ్నించారు. ఎప్పుడు పోలీసులు వచ్చి ఏం చేస్తారోనని.. ఇంట్లో ఉండాలంటేనే భయం వేస్తోందని చెప్పారు. తమ ఇంట్లో ఉన్న మగవాళ్లందరినీ తీసుకెళ్లారని… ఎనిమిది రోజులుగా తమ పిల్లలు ఎక్కడున్నారో తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ఉన్నప్పుడు మేము చాలా బాగా బతికామని.. గత 9 నెలలుగా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. తమమా ప్రాణాలు పోయినా సరే ఫార్మా కంపెనీకి భూములు ఇవ్వమని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డిని కలిసేందుకు వెళ్తే తమను బెదిరించి పంపించారని చెప్పారు.