ఖమ్మం, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ ఉన్నంత కాలం కేసీఆర్ పేరు సజీవంగా నిలుస్తుందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు.మొలకెత్తనివ్వబోమనడానికి కేసీఆర్ మొక్క కాదని, మహా వృక్షమని స్పష్టం చేశారు. కేసీఆర్‌ను తుడిచిపెట్టడం రేవంత్‌కే కాదు.. అతడి జేజమ్మ వల్ల కాదని గుర్తుంచుకోవాలని హితవుచెప్పారు. ఉద్యమ సమయంలో ఉద్యమకారులను అణచివేసేందుకు జేబులో పిస్టల్ పెట్టుకొని తిరిగిన రేవంత్.. కేసీఆర్‌ను లేకుండా చేస్తానంటూ విడ్డూరంగా ఉన్నదని అన్నారు. లగచర్ల గిరిజన రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం ఖమ్మంలో కొవ్వొత్తులతో సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. భారీ సంఖ్యలో రైతులు, గిరిజన మహిళలు, పార్టీ కార్యకర్తలు హాజరుకావడంతో ప్రధాన రహదారి కిక్కిరిసిపోయింది. ఈ సందర్భంగా అజయ్ మాట్లాడుతూ.. రేవంత్‌కు ఇచ్చిన రూ.100 కోట్లు అమెరికాలో అదానీ దోచుకున్న రూ.2 వేల కోట్లలోవేనా? అని ప్రశ్నించారు.
ఉద్యమ సమయంలోనే చంద్రబాబునాయడు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి లాంటి ముఖ్యమంత్రులే కేసీఆర్‌ను ఏమీ చేయలేకపోయారని గుర్తుచేశారు. ఇప్పుడు రేవంత్‌రెడ్డి వల్ల మాత్రం ఏమవుతుందని ఎద్దేవా చేశారు. కేసులు, జైళ్లు వంటివి కేసీఆర్‌కు, బీఆర్ఎస్కు, పార్టీ క్యాడర్‌కు కొత్తేమీ కాదని స్పష్టం చేశారు. వాటికి భయపడేవాళ్లమే అయితే తెలంగాణనే వచ్చేది కాదని స్పష్టం చేశారు. లగచర్ల గిరిజనులకు జరుగుతున్న అన్యాయంపై రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడటంలేదని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ప్రశ్నించారు. ఈ నెల 25 నుంచి జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఇదే విషయమై బీఆర్ఎస్ పోరాడుతుందని స్పష్టంచేశారు. సీఎం రేవంత్‌రెడ్డికి కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు ఫోబియా పట్టుకుందని ఎమ్మెల్సీ తాతా మధు విమర్శించారు. కేసీఆర్‌ను తుడిచివేస్తానని అనడం సీఎం స్థాయికి తగదని అన్నారు. ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, బీఆర్ఎస్ నాయకులు లింగాల కమల్‌రాజు, రాకేశ్‌రెడ్డి, కొండబాల కొటేశ్వరరావు, కూరాకుల నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.