హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబరు 13 (నమస్తే తెలంగాణ)/ సంగారెడ్డి: లగచర్ల కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న రైతు హీర్యానాయక్ ఛాతీలో నొప్పి కారణంగా గురువారం నిమ్స్ దవాఖానకు తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందించి ఆరోగ్యం మెరుగుపడడంతో డిశ్చార్జ్ చేశారు. దీంతో పోలీసులు తిరిగి హీర్యానాయక్‌ను జెలుకు తరలించారు. కంది సెంట్రల్ జైలులో హీర్యానాయక్‌ను ఆయన భార్య దేవీబాయి, తండ్రి రూప్లానాయక్, తల్లి లచ్చిమిబాయి కలిసి కంటతడిపెట్టారు. హీర్యానాయక్ ఆరోగ్యం ఏమాత్రం బాగోలేకున్నా ఎవరూ పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు.
లగచర్ల రైతు హీర్యానాయక్‌కు బేడీలు వేసిన ఘటనపై కంది సెంట్రల్జైల్లో రెండో రోజు విచారణ కొనసాగింది. మల్టీజోన్ ఐజీ సత్యనారాయణ గురువారం రెండుగంటలపాటు విచారణ జరిపి ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి అందజేయడంతో ప్రభుత్వం కంది సెంట్రల్‌జైల్ జైలర్ సంజీవరెడ్డిపై సస్పెన్షన్ వేటు వేసింది. జైలు సూపరింటిండెంట్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని జైళ్లశాఖ డీజీ హోంశాఖ కార్యదర్శికి సిఫార్సు చేశారు. శుక్రవారం జైళ్ల శాఖ ఐజీలు మురళీబాబు, రాజేశ్ కంది సెంట్రల్‌జైలుకు వచ్చి విచారణ చేపట్టారు.