గోదావరిఖని, డిసెంబర్ 26 : శ్రీరాంపూర్ డివిజన్లోని ఇందారం ఖని ఓసీలో ఓవర్ బర్డెన్ తొలగింపు పనుల్లో విఫలమైన ప్రైవేట్ కాంట్రాక్టర్‌కు విధించిన రూ.24కోట్ల పెనాల్టీని చెల్లించాల్సిందేనని, ఈ కుంభకోణంలో బాధ్యులెవరైనా చర్యలు తీసుకోవాల్సిందేనని కార్మిక సంఘాలు సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశాయి. పెనాల్టీని మాఫీ కోసం కాంట్రాక్టర్ చేస్తున్న ప్రయత్నాలపై వాస్తవాలను ‘నమస్తే తెలంగాణ’ వెలికితీసిన క్రమంలో సంఘాల నాయకులు యాజమాన్యంపై తీవ్రంగా మండిపడుతున్నారు. పెనాల్టీని తప్పించుకునేందుకు అధికారులతో కుమ్మక్కై చేస్తున్న యత్నాలను తీవ్రంగా ఎండగడుతున్నారు. ఈ క్రమంలోనే పలు కార్మిక సంఘాల నాయకులు ‘నమస్తే తెలంగాణ’తో తమ అభిప్రాయాలను తెలియజేశారు.
ఈ వ్యవహారాన్ని హెచ్ఎంఎస్ తీవ్రంగా పరిగణిస్తుంది. బాధ్యులపై వెంట నే చర్యలు తీసుకోవాలి. ఓబీ కాంట్రాక్టర్‌పై వేసిన పెనాల్టీని వసూలు చేయాలి. రిటైర్ అయి న కార్మికుడు క్వార్టర్ ఖాళీ చేయకుంటే ఆయనకు రా వాల్సిన లాభాల వాటా, ఇతర బెన్ఫిట్లను ఆపుతున్న యాజమాన్యం నిలువు దోపిడీగా సాగుతున్న కుంభకోణాలకు సం బంధించి ఎందుకు స్పందించడం లేదు.
– రియాజ్ అహ్మద్, హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి
ఇందారం ఖని ఓసీలో జరిగిన ఓబీ కుంభకోణంలో కాంట్రాక్టర్ నుంచి పెనాల్టీని సింగరేణి ఎట్టి పరిస్థితుల్లో వసూలు చేయాల్సిందే. బొగ్గుపై కప్పబడి ఉండే మట్టిని వెలికితీసేందుకు కాంట్రాక్టు పొందిన ఓబీ కాంట్రాక్టర్ తాను చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి అధికార పార్టీ అండదండలతో తప్పించుకోవాలని చూస్తున్నాడు. కార్మికులు చిన్న తప్పు పనిచేస్తే చర్యలు ఇచ్చే యాజమాన్యం, ఈ కుంభకోణంపై ఎందుకు స్పందించడం లేదు. కమిటీల పేరుతో అనుకూలమైన రిపోర్టులు ఇవ్వడం సరికాదు. ఈ వ్యవహారంలో గతంలో అనేక మార్లు ఫిర్యాదు చేసినా ఎందుకు పట్టించుకోలేదు. దీనిని మేం సీరియస్‌గా పరిగణిస్తున్నాం.
– మిర్యాల రాజిరెడ్డి, టీబీజీకేఎస్ అధ్యక్షుడు
ఓబీ కుంభకోణంలో బాధ్యులెవరైనా వారిపై చర్యలు తీసుకోవాలి. నిర్దేశిత ఓవర్ బర్డెన్ తొలగింపు చేయకుండా నిర్లక్ష్యం చేసిన కాంట్రాక్టర్‌పై విధించిన పెనాల్టీని ఎట్టి పరిస్థితుల్లో వసూలు చేయాలి. సంస్థలో బదిలీ అయిన ఉన్నతాధికారి వల్లే ఈ కుంభకోణం జరిగిందని మేం భావిస్తున్నాం. అవినీతి ఆరోపణలున్న వ్యక్తిని విచారణ అధికారిగా కమిటీకి నియమించి విచారణ చేయడం దురదృష్టకరం. తప్పుడు నివేదికలిచ్చిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందే. సరైన విధానంలో మట్టి తొలగించకపోవడం వల్ల ఉత్పత్తికి తీవ్ర విఘాతం కలుగుతుంది.
– తుమ్మల రాజారెడ్డి, సీఐటీయూ సింగరేణి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు