RTC Strike | హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ):ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, పీఆర్సీ ఏరియర్స్ చెల్లింపు, యూనియన్ల పునరుద్ధరణ వంటి సమస్యలు పరిష్కరించాలని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో తెలంగాణ లేబర్ క మిషన్ కీలక ప్రకటన చేసింది. ఈ నెల 25 న చర్చలకు రావాలని ఆర్టీసీ యాజమాన్యానికి, ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీకి కమిష న్ లేఖలు పంపింది. హైదరాబాద్ జాయిం ట్ కమిషనర్ ఆఫ్ లేబర్, కాన్సిలియేషన్ ఆఫీసర్ సునీతాగోపాల్దాస్ నేతృత్వంలో ఈ నెల 20 నుంచే చర్చల ప్రక్రియ ప్రారంభమైందని తెలిసింది.
పారిశ్రామిక వివాదాల చట్టం-1947లోని సెక్షన్ 12 ప్రకారం ఈ వివాదాన్ని లే బర్ కమిషన్ విచారణకు స్వీకరించిన నేపథ్యంలో ఇరుపక్షాలను చర్చలకు పిలువ డం ప్రాధాన్యం సంతరించుకున్నది. కాం గ్రెస్ రెండున్నరేండ్ల నుంచి తమను మోసగిస్తూనే ఉన్నదని, మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను అమలు చేయాలని నిరుడు మే నెలలో ఆర్టీసీ కార్మికులు సమ్మె నోటీసు ఇచ్చారు. దీంతో ప్రభుత్వం కార్మిక సం ఘాల్లో చీలక తెచ్చి సమ్మెను నిర్వీర్యం చేసింది. తాజాగా కార్మికులు మరోసారి సమ్మెకు వెళ్తామని తేల్చిచెప్పిన క్రమంలో జరిగే చర్చలపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.
ఈ నెల 25 సాయంత్రం 4గంటలకు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సమీపంలోని అంజయ్య కార్మిక భవన్లో చర్చలకు సంబంధించిన కీలక సమావేశం జరగనున్నది. ఈ సమావేశానికి సంస్థ యాజమా న్యం తమ ప్రతినిధులతో పాటు సమ్మె నో టీసు ఇచ్చిన అన్ని ప్రధాన సంఘాల నేత లు హాజరుకావాలని లేబర్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. సమావేశానికి హాజర య్యే ప్రతినిధులు సమ్మె వివాదానికి సం బంధించిన పూర్తి రికార్డులు, ఆధారాలతో రావాలని కాన్సిలియేషన్ ఆఫీసర్ సూచించారు. యాజమాన్యం తరఫున నిర్ణయాలు తీసుకోగల సమర్థులైన అధికారులను మాత్రమే పంపాలని స్పష్టంచేశారు.
ఇప్పటికే సమ్మె సైరన్ మోగించిన కార్మిక సంఘాల నేతలు ఈ నెల 26 వరకూ ప్రభుత్వానికి డెడ్లైన్ విధించారు. అప్పటిలోగా శాశ్వత పరిష్కారం చూపకపోతే మెరుపు సమ్మెకు వెళ్తామని తేల్చిచెబుతున్నారు. గతంలో మాదిరిగా 25న చర్చలకు ఆర్టీసీ ఉన్నతాధికారులు గైర్హాజరైతే తప్పకుండా మెరుపు సమ్మెకు వెళ్తామని హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం, ఆర్టీసీతో చర్చలు సఫలం కాకపోతే 26 తర్వాత సమ్మె తేదీని ప్రకటిస్తామని, అప్పటికీ ప్రభుత్వం, యాజమాన్యం స్పందికపోతే మెరుపు సమ్మెకు దిగుతామని స్పష్టంచేస్తున్నారు.
ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ భాగస్వామ్య సంఘాలైన ఈయూ, టీఎంయూ, ఎన్ఎంయూ, బీకేయూ, బీడబ్ల్యూయూ, కేపీ సంఘాల ప్రతినిధులు 25న ఆర్టీసీ యాజమాన్యంతో జరిగే చర్చలకు తప్పనిసరిగా హాజరుకావాలి. అంజయ్య భవన్లో కాన్సిలియేలేషన్ ఆఫీసర్, జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ మరోసారి చర్చలకు ఆహ్వానించిన సందర్భంగా అందరూ సకాలంలో రావాలి. మనపై ఆధారపడిన కార్మికుల ప్రతినిధులుగా అన్ని సమస్యలపై చర్చించాల్సి ఉంది. జేఏసీ భాగస్వామ్య సంఘాలన్నీ మీటింగ్కు హాజరుకావాలి.
– ఈదురు వెంకన్న, జేఏసీ చైర్మన్