L Ramana | ఉత్తర తెలంగాణలో అతిపెద్ద దేవాలయం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్.రమణ అన్నారు. రెండో రోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శాసన మండలిలో ఆయన మాట్లాడుతూ.. యాదాద్రి ఆలయం మాదిరిగానే వేములవాడ, కొండగట్టు ఆలయాలను అభివృద్ధి చేయాలని కేసీఆర్ భావించారని తెలిపారు. అందుకే ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు మంజూరు చేస్తూ జీవో కూడా ఇచ్చారని గుర్తుచేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కొండగట్టు ఆలయ పనులను నిలిపివేసిందని విమర్శించారు. ఈ జీవో నిలుపుదలపై సమీక్ష చేశారా లేదా అని ఆయన ప్రశ్నించారు. కొండగట్టు ఆలయ పరిధిలోకి 600 ఎకరాల భూమిని తెచ్చారని.. కానీ ప్రొసీడింగ్స్ అమలు చేయడం లేదని ఎల్.రమణ తెలిపారు. ఘాట్ రోడ్డు నిర్మాణం, పలు అభివృద్ధి పనుల కోసం రూ.500 కోట్లు ఇస్తామని కేసీఆర్ చెప్పారని అన్నారు. ఆ పనులను వెంటనే పునరుద్ధరించాలని కోరారు.