e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 24, 2021
Home Top Slides టీఆర్‌ఎస్‌లో చేరిన ఎల్‌ రమణ

టీఆర్‌ఎస్‌లో చేరిన ఎల్‌ రమణ

టీఆర్‌ఎస్‌లో చేరిన ఎల్‌ రమణ
  • పార్టీ సభ్యత్వం ఇచ్చిన మంత్రి కేటీఆర్‌
  • సీఎం కేసీఆర్‌కు ఎల్‌ రమణ కృతజ్ఞతలు
  • రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామి అవుతానని వెల్లడి

హైదరాబాద్‌, జూలై 12 (నమస్తే తెలంగాణ): తెలంగాణ తెలుగుదేశం పార్టీ (టీటీడీపీ) మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి ఎల్‌ రమణ సోమవారం టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఆయనకు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర పురపాలక, ఐటీశాఖల మంత్రి కే తారక రామారావు పార్టీ సభ్యతాన్ని ఇచ్చారు. తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్‌, ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, శంభీపూర్‌ రాజు, ఎమ్మెల్యేలు విద్యాసాగర్‌రావు, డాక్టర్‌ సంజయ్‌, నన్నపునేని నరేందర్‌, మాజీ ఎమ్మెల్సీలు సుధాకర్‌రావు, ఫ్రొఫెసర్‌ ఎం శ్రీనివాస్‌రెడ్డి సహా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎల్‌ రమణకు మంత్రులు, టీఆర్‌ఎస్‌ నేతలు స్వాగతం పలికారు.

రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పాటుపడతా
తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధిలో పాలుపంచుకొంటానని ఎల్‌ రమణ అన్నారు. మారుతున్న రాజకీయ సమీకరణలను బట్టి చూస్తే రాష్ట్ర ప్రజలకు టీఆర్‌ఎస్‌ మాత్రమే జెండా, ఎజెండాగా మారిందని, అందుకే తాను టీఆర్‌ఎస్‌లో చేరానని పార్టీ సభ్యత్వం స్వీకరించిన సందర్భంగా పేర్కొన్నారు. గత 20 ఏండ్లలో అనేక ఒడిదుడుకులు అధిగమించి సీఎం కేసీఆర్‌ రాష్ర్టాన్ని సాధించటమే కాక.. సాధించిన రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో ప్రగతిపథంలో ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పారు. సుధీర్ఘ రాజకీయానుభవం ఉన్న సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో ఒక సభ్యుడిగా చేరినందుకు సంతోషిస్తున్నానని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామి కావాలని పెద్ద మనసుతో సీఎం కేసీఆర్‌ తనను టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారని వెల్లడించారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, పార్లమెంట్‌ సభ్యుడిగా, టీడీపీ తెలంగాణ అధ్యక్షుడిగా పనిచేసిన తాను టీఆర్‌ఎస్‌ పార్టీలోని అన్ని వర్గాలతో కలిసి రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృషిచేస్తానని పేర్కొన్నారు.

- Advertisement -

రమణకు స్వాగతం
సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో రాష్ట్రంలో సాగుతున్న అభివృద్ధిలో భాగస్వామి కావాలనే ఆలోచనతో టీఆర్‌ఎస్‌లో చేరిన ఎల్‌ రమణకు స్వాగతం పలుకుతున్నామని రాష్ట్ర మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌ అన్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా బడుగు, బలహీనవర్గాలకు చెందిన నాయకుడిగా రమణకు మంచి పేరున్నదని, ఆయన రాకతో పార్టీకి మరింత మేలు జరుగుతుందని కొప్పుల ఈశ్వర్‌ ఆశాభావం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ తప్ప మరో పార్టీకి భవితవ్యం లేదని గంగుల కమలాకర్‌ పేర్కొన్నారు. ఎల్‌ రమణకు టీఆర్‌ఎస్‌ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు.

మంత్రులను కలిసిన రమణ
టీఆర్‌ఎస్‌ సభ్యత్వం తీసుకున్న తర్వాత ఎల్‌ రమణ మంత్రుల నివాసానికి వెళ్లి మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన వెంట రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్‌, ఎమ్మెల్యేలు విద్యాసాగర్‌రావు, డాక్టర్‌ సంజయ్‌, మాజీ ఎమ్మెల్సీ సుధాకర్‌రావు తదితరులు ఉన్నారు. ఎల్‌ రమణకు మంత్రులు పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
టీఆర్‌ఎస్‌లో చేరిన ఎల్‌ రమణ
టీఆర్‌ఎస్‌లో చేరిన ఎల్‌ రమణ
టీఆర్‌ఎస్‌లో చేరిన ఎల్‌ రమణ

ట్రెండింగ్‌

Advertisement