నమస్తే తెలంగాణ నెట్వర్క్: హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను బానిస అంటూ బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై బీసీ కులాలు మండిపడ్డాయి. బీసీ సమాజానికి ముఖ్యంగా యాదవులకు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. ఈటల గ్రామాల్లోకి వస్తే అడ్డుకుంటామని హెచ్చరించాయి. గురువారం యాదవులు వరంగల్అర్బన్ జిల్లా కమలాపూర్ బస్టాండ్ ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా అఖిల భారత యాదవ మహాసభ నియోజకవర్గ ఇన్చార్జి కన్నెబోయిన శ్రీనివాస్ మాట్లాడుతూ.. యాదవ కులానికి చెందిన గెల్లు శ్రీనివాస్‌ను సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటిస్తే ఈటల జీర్ణించుకోలేక పోతున్నారని మండిపడ్డారు. యాదవులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేదంటే గ్రామాల్లో తిరగకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. హుజూరాబాద్‌లోని అంబేద్కర్ చౌరస్తా, ఇల్లందకుంటలో గొల్ల, కుర్మల సంఘాల నేతలు ఈటల దిష్టిబొమ్మను దహనం చేశారు.
బీసీలకు క్షమాపణ చెప్పాలి: ఎల్ రమణ
బీసీలంటే బానిసలు కాదని మాజీమంత్రి ఎల్ రమణ పేర్కొన్నారు. ఈటల రాజేందర్ టీఆర్ఎస్కు ద్రోహం చేశారని చెప్పారు. హుజూరాబాద్‌లో గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలిచి చూపిస్తాడని.. ఈటల రాజేందర్ బీసీలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బానిస అని అనడం దురదృష్టకరమని పేర్కొన్నారు.
పదవులు అనుభవించిన నువ్వు బానిసవా?: మంత్రి కొప్పుల
బీసీ కులానికి చెందిన టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను బానిస అనడం సమంజసమేనా ఈటల? అని ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రశ్నించారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా పని చేయడంతోపాటు, అనేక పదవులు ఆశించిన నువ్వు బానిస ఎలా అయ్యావని బీజేపీ నేత ఈటలను నిలదీశారు. ‘రెండు నెలలుగా ప్రజల్లో తిరుగుతున్న నువ్వు వారికి ఏం సమాధానం చెప్తున్నావు? దళితులు, బీసీలు, దేవాదాయశాఖ భూములు ఆక్రమించునకున్నానని చెప్తున్నావా?’ అని ఎద్దేవా చేశారు. గతంలో రైతుబంధును ఇక్కడ ప్రారంభిస్తే ఎంతో సంతోషపడ్డ నువ్వు, ఇప్పుడు దళితబంధును హుజూరాబాద్‌లో ప్రారంభిస్తుంటే ఎందుకు ఈర్ష్య పడుతున్నావని మండిపడ్డారు.
అక్కడ బీసీ.. ఇక్కడ ఓసీ: మంత్రి తలసాని
హుజూరాబాద్‌లో బీసీగా చలామణి అవుతున్న ఈటల రాజేందర్.. శామీర్‌పేటకు వస్తే ఓసీగా మారిపోతారని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. తెలంగాణ ఉద్యమం లో పలుమార్లు జైలుకెళ్లిన గెల్లు శ్రీనివాస్‌కు సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ అభ్యర్థిగా అవకాశమిస్తే.. ఈటల అహంకారపూరితంగా బానిసగా అభివర్ణించడాన్ని ఖండించారు. గురువారం అసెంబ్లీ మీడి యా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. గెల్లు శ్రీనివాస్ చిన్నపిల్లాడే కావచ్చు కానీ, ఆయన వెనుక పార్టీ ఉన్నది, సీఎం కేసీఆర్ ఉన్నాడనే విషయాన్ని ఈటల మరచిపోవద్దని గుర్తుచేశారు. 2004లో సీనియర్‌నేత ముద్దసాని దామోదర్‌రెడ్డిపై కేసీఆర్ అవకాశమిస్తేనే ఎమ్మెల్యేగా గెలిచి ఎదిగాడన్న సంగతిని ఈటల మరచిపోయాడని మండిపడ్డారు.