హైదరాబాద్, మే 7(నమస్తే తెలంగాణ): కరీంనగర్లో అదుపు తప్పిన శాంతిభద్రతలపై ప్రశ్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గంగుల క్యాంపు కార్యాలయం, పాడి కౌశిక్‌రెడ్డి వాహనంపై బీజేపీ గుండాలు దాడి చేయడం దుర్మార్గమని మండలి బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ ఎల్ రమణ ఖండించారు. పట్టపగలు బండి సంజయ్ అనుచరులు అరాచకం సృష్టించడం, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం దారుణమని దుయ్యబట్టారు. గురువారం తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడుతూ.. బాధ్యతాయుతమైన హోంశాఖ సహాయ మంత్రి పదవిలో ఉన్న బండి సంజయ్, బజారు భాష మాట్లాడడమే గాకుండా, తన గూండాలతో బీఆర్ఎస్ నేతలపై దాడులకు తెగబడడం సిగ్గుచేటన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని, కానీ బెదిరింపులు దుర్మార్గమని మండిపడ్డారు. కారకులపై పీడీయాక్ట్ పెట్టాలని డిమాండ్ చేశారు.
కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల మాట్లాడుతూ.. శాంతిభద్రతల విషయంలో విఫలమైన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇద్దరు కలిసి తెలంగాణను భ్రష్టు పట్టిస్తున్నారని విరుచుకుపడ్డారు. బాధ్యతాయుతమైన హోదాలో ఉన్న బండి, ఎమ్మెల్యే గంగుల ఆఫీసుపై దాడి చేయించడం దారుణమని దుయ్యబట్టారు. కరీంనగర్లో లూటీ జరిగి 5 రోజులు దాటినా దోపిడీకి పాల్పడ్డ దొంగలను ఎందుకు పట్టుకోలేదని నిలదీశారు. చదువు, సంధ్యలేని ఆయన.. కేటీఆర్, గంగుల, కౌశిక్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేనిస్థితిలో దాడులకు ఉసిగొల్పడం సిగ్గుచేటన్నారు. శిశు సంక్షేమ, మున్సిపల్ డెవలప్మెంట్పై 10 నిమిషాలైనా మాట్లాడాలని చురకలంటించారు.