హైదరాబాద్, డిసెంబర్ 24(నమస్తే తెలంగాణ): గ్లోబల్ సమ్మిట్, యూనివర్సిటీల సదస్సులకే రాష్ట్ర ప్రభుత్వం పరిమితమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో రెండ్రోజులపాటు జరిగిన రాష్ట్ర కార్యవర్గం, కౌన్సిల్ సమావేశాలు బుధవారంతో ముగిసాయి.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు.. మహిళలకు రూ. 2500లు, రూ.4వేల పెన్షన్, కళ్యాణలక్ష్మికి తులం బంగారం లాంటి హామీలు తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. పంచాయతీ, మున్సిపల్‌శాఖలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంచాలని కోరారు. జనవరి 18న సీపీఐ వందేళ్ల వేడుకలు ఖమ్మం జిల్లాల్లో నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఈ వేడుకల్లో జాతీయ సెమినర్, కౌన్సిల్ సమావేశం జరుగనున్నదని, విదేశాల నుంచి ప్రతినిధులు, ఇతర వామపక్ష పార్టీల ముఖ్య నేతలు హాజరుకానున్నారని పేర్కొన్నారు. ఈ సమావేశాలకు సీఎం రేవంత్‌రెడ్డిని ఆహ్వానిస్తామని కూనంనేని తెలిపారు.