పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మాజీ సర్పంచులు గురువారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ ఎంపీడీవో కార్యాలయానికి తాళంవేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ పంచాయతీల్లో సీసీ రోడ్లు, పల్లె ప్రకృతివనాలు, మన ఊరు-మనబడి.. తదితర అభివృద్ధి పనులు చేపట్టి రెండేళ్లు కావస్తున్నదని చెప్పారు. బిల్లుల కోసం అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. కోసిన గ్రామపంచాయతీకి రూ. 22 లక్షలు, ఎన్జీవోస్కు రూ. 40 లక్షలు. బారేగూడకు రూ.14 లక్షలు, జగన్నాథ్పూర్కు రూ.22 లక్షలు, అందెవెళ్లికి రూ.9 లక్షలు, బోడేపల్లికి రూ.42 లక్షలు, భట్పల్లికి రూ.35 లక్షలు, ఇలా 20 గ్రామ పంచాయతీలకు బిల్లులు రావాల్సి ఉన్నదని పేర్కొన్నారు. సర్కారు వెంటనే స్పందించి బిల్లులు మంజూరు చేయాలని కోరారు.
కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం బస్వన్నపల్లిలో తాగునీటికి కటకట ఏర్పడింది. కేసీఆర్ హయాంలో ప్రారంభించిన మిషన్ భగీరథ పథకంతో ఈ గ్రామానికి నీటి కష్టాలు తొలగిపోయాయి. కొన్ని రోజులుగా భగీరథ నీళ్లు రావడం లేదని గ్రామస్థులు చెప్తున్నారు. గ్రామంలో ఉన్న దాదాపు 50 చేద బావులే ప్రస్తుతం తమకు ఆసరాగా నిలుస్తున్నాయని అంటున్నారు. బావులు లేని వారు రూ.1,200 పెట్టి వాటర్ ట్యాంకర్ ద్వారా నీటిని తెచ్చుకోవాల్సి వస్తున్నదని చెప్తున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకొని నీటి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.