గీసుగొండ. ఫిబ్రవరి 10 : వచ్చేసారి కాంగ్రెస్ ప్రభుత్వం(Congress) గెలువదని కూడా చైర్మన్ ఇనగాల వెంకటరామిరెడ్డి (Kuda Chairman Venkataramireddy )సంచలన వ్యాఖ్యలు చేశారు. పదేళ్లు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పని చేసిన గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలకు ఇదే చివరి అవకాశం.. ఇప్పుడే పోటీ చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవాలన్నారు. వచ్చేసారి కాంగ్రెస్ ప్రభుత్వం రాదన్నారు. గీసుకొండ మండలంలోని మరియాపురం శివారులోని ఎస్ ఎస్ గార్డెన్ లో సోమవారం జరిగిన గీసుకొండ, సంగెం మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
సర్పంచులు, వార్డు సభ్యులు కాని, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలుగా పోటీ చేస్తాం అనుకునే వారు ఇప్పటి నుంచే గ్రామాల్లో కష్టపడి పని చేయాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలువడానికి ఇదే ఆఖరి అవకాశం. మనం దీన్ని వాడుకోవాలని కోరారు. వచ్చేసారికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాదని, తర్వాత మీకు అవకాశాలు రావు అని స్పష్టం చేశారు. ఇల్లు ఉన్నప్పుడే దీపం సక్క పెట్టుకోవాలని చెప్పుకొచ్చారు. దీంతో పక్కనే ఉన్న ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి షాక్ అయ్యారు.
గ్రూపు రాజకీయాలు విడాలని కొత్త పాత తేడా లేకుండా అందరూ కలిసి పనిచేసి అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచేలా ప్రయత్నం చేయాలని కోరారు. ప్రతి కార్యకర్త కష్టపడి పని చేస్తేనే ఎన్నికల్లో గెలుస్తామని గ్రూపు రాజకీయాలతో మనలో మనమే కత్తులు దూసుకోవద్దని కోరారు. గ్రూపు రాజకీయాలతో నష్టపోయేది మనమేనని ఇప్పటికైనా మారి అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి ఉపాధ్యక్షుడు దొమ్మాటి సాంబయ్య, గీసిగొండ, సంగెం మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్, మాధవరెడ్డి, మాజీ ఎంపీపీ సౌజన్య, అధికార ప్రతినిధి కోము రారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.