హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ) : సీఎం రేవంత్ రెడ్డి ఎన్ని రకాల కేసులు పెట్టినా కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటామని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. బీఆర్ఎస్ ఉద్యమ పార్టీ అని, రానున్న రోజుల్లో ప్రజల పక్షాన నిలబడి మరింత పోరాడతామని స్పష్టం చేశారు. రాజకీయ కక్షలో భాగంగానే కేటీఆర్‌ను ఏసీబీ విచారణకు పిలిచినట్టు పేర్కొన్నారు. ఫార్ములా ఈ రేసులో అవినీతి జరిగినట్టు ఏసీబీ వద్ద ఒక్క ఆధారం లేదని తెలిపారు. నాడు మంత్రిగా కేటీఆర్ పారదర్శకంగా, దేశం గర్వించేలా ఈ రేసును నిర్వహించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనను గాలికొదిలేసి, కేసీఆర్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ రేసు నిర్వహణలో అవినీతి అంటూ కేటీఆర్‌పై కేసు పెట్టించారని, 18 నెలల్లో ఏమీ తేల్చలేకపోయారని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ పనిగట్టుకొని మరీ కేటీఆర్‌కు లేని అవినీతిని అంటగట్టి, ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆక్షేపించారు. మిస్ వరల్డ్ పోటీలతో రాష్ట్రానికి పైసా పెట్టుబడి రాలేదని.. పైగా తనను వేధింపులకు గురిచేశారంటూ మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ తీవ్ర ఆరోపణలు చేయడంతో అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర పరువుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్ సమీపంలో కేఫ్‌లో ఛాయ్ తాగుతున్న కస్టమర్లను కూడా బలవంతంగా బయటకు పంపించడాన్ని చూస్తే రాష్ట్రంలో పూర్తిగా రాక్షస పాలన నడుస్తున్నదని మండిపడ్డారు.